వైసీపీలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ చిత్తూరు జిల్లా మహిళా సేవాదళ్ కార్యదర్శి సుహాసినీ రెడ్డి ఆరోపించారు. జగన్ మీద అభిమానంతో తాను పార్టీ పెట్టిన వెంటనే వైసీపీలో చేరానని చెప్పారు. అలాంటి తనకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

గతంలో టీడీపీలో ఉండి.. అక్కడ టికెట్ దొరకక.. వైసీపీలో చేరిన వారికి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  పార్టీ కోసం తాను కుటుంబానికి కూడా దూరమయ్యానని.. పార్టీ కార్యక్రమాలకు లక్షల రూపాయలు ఖర్చుచేశానని ఆమె చెప్పారు. అయినప్పటికీ తనను గుర్తించడం లేదన్నారు.

జగన్ సీఎం కావాలని తాను పార్టీ కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. అలాంటి తనను వేరే పార్టీకి సహకరిస్తోందంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.