రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజెపికి షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

అనపర్తి: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజెపికి షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో బిజెపి కుమ్మక్కయి రాష్ట్రానికి అన్యాయం చేయడానికి తాను సిద్ధపడినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విమర్శకు ఆయన తగిన సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డారు.

ఆయన తన పాదయాత్ర శిబిరం వద్ద పార్టీ రీజనల్‌​ కో ఆర్డినేటర్స్‌, కీలక నేతలతో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక విషయంపై పార్టీ నేతలతో చర్చించి వైఎస్‌ జగన్‌ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

సమావేశం తర్వాత వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు మీడియాతో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ నేరవేర్చనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పార్లమెంట్‌ వర్షకాల సమావేశాలు జరిగినంత కాలం పార్లమెంట్‌ ఆవరణలోనే నిరసన తెలపాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయం తీసుకుంది. 

రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోనే నిరసన తెలియజేస్తారని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైసిపి లోకసభ సభ్యులు రాజీనామా చేసినప్పటికీ రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయలేదు.