చిత్తూరు జిల్లాకు చెందిన వైసిపి కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ రికార్డ్ చేసుకున్న సెల్పీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సొంత పార్టీ నాయకుల వల్లే తాను చనిపోతున్నానంటూ సదరు వైసిపి కార్యకర్త తెలిపాడు.
చిత్తూరు: అధికార పార్టీ నాయకుల వేధింపులకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు బలవుతున్నారని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వైసిపి కార్యకర్తే తన పార్టీ నాయకుల అక్రమాలు, ప్రభుత్వ తీరుతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... చంద్రగిరి మండలం పనపాకం పంచాయితీ పాతపేటకు చెందిన వెంకటేష్ ఆచారి వైసిపి కార్యకర్త. అతడికి గ్రామంలో కొంత స్థలం వుంది. ఆ స్థలాన్ని రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామచంద్రయ్య ఆక్రమించుకున్నాడంట. తన స్థలాన్ని తిరిగి తనకు దక్కేలా చేసి ఆదుకోవాలని మండల రెవెన్యూ, పోలీసులు అధికారుల కార్యాలయాల చుట్టూ ఏడాది కాలంగా తిరిగిన ఫలితం లేదని బాధితుడు వాపోయాడు.
వీడియో
మరోవైపు గ్రామ నాయకుల హామీతో రోడ్డు పనులకు చేయించానని... ఇందులో రూపాయి లాభం రాకపోగా తిరిగి రూ.6 లక్షలు అప్పులు మిగిలాయని వెంకటేష్ పేర్కొన్నాడు. ఇది కూడా తన ఆత్మహత్యకు కారణమని బాధితుడు తెలిపాడు.
ఇలా స్థలం కబ్జాకు గురవడం, ఆర్థిక కష్టాల్లో కూరుకుపోవడంతో ఆత్మహత్యకు సిద్దమయ్యడు బాధితుడు. తన చావుకు ప్రభుత్వ అధికారులు, కొందరు స్థానిక వైసిపి నేతలే కారణమంటూ బాధితుడు తెలిపాడు. సెల్పీ వీడియో ద్వారా ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. ఆ వీడియో పోలీసులకు చేరడంతో బాధితుడు వెంకటేష్ కోసం పనపాకం పరిసరాల్లోకి అడవుల్లో గాలిస్తున్నారు చంద్రగిరి పోలీసులు.
