వైసీపీ సర్పంచ్ మృతి కేసులో అతని తల్లి పోలీసుల మీద ఆరోపణలు చేశారు. పోలీసులే కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అనంతపురం : ‘వైసిపి సర్పంచ్ అయిన నా కుమారుడిని పోలీసులు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు. న్యాయం కోసం ఎస్పీని సంప్రదిస్తే ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు’ అని అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం జంగంపల్లికి చెందిన రామాంజినమ్మ ఆరోపించారు. సోమవారం స్పందన కార్యక్రమానికి వచ్చిన ఆమె తన సమస్యను ఎస్పీకి తెలియజేయడానికి ప్రయత్నించగా.. కనీసం వినకుండా.. ఫిర్యాదు తీసుకోకుండా బయటకు పంపించారని వాపోయింది. ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో తన ఆవేదనను వెల్లబోసుకుంది. 

‘నా కుమారుడు చంద్ర శేఖర్ నాయుడు లారీ డ్రైవర్. స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఐదెకరాల పొలం అమ్మి, అప్పులు చేసి గెలిచాడు. అప్పుల భారం అధికం కావడంతో డ్రైవర్గా వృత్తిని కొనసాగించాడు. ఓ లారీ యజమాని దగ్గర పనిచేసేవాడు. గత నెల సరుకు రవాణా సొమ్ము రూ. 1.70 లక్షలను డ్రైవర్ కాజేశాడంటూ యజమాని తాడిపత్రిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే లారీ యజమాని నా కుమారుడిని హైదరాబాదులో గుర్తించి తాడిపత్రికి తీసుకువచ్చాడు. వెంటనే పోలీసులకు అప్పగించకుండా తన ఫ్యాక్టరీ లో ఉంచుకొని ఆ తరువాత పోలీసులకు అప్పగించాడు.

బాపట్ల జిల్లాలో విషాదం: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట సూసైడ్

పోలీసులు నాకు ఫోన్ చేసి డబ్బు తీసుకొని వస్తేనే మీ అబ్బాయిని వదిలేస్తారని చెప్పారు. నేను వెంటనే తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. కొద్దిసేపటి తర్వాత మీ కుమారుడు ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పారు. కంగారుపడుతూ వెళ్లగా నాకుమారుడు చనిపోయి కనిపించాడు. ఏమైందని లారీ యజమానికి చెందిన మనుషుల్ని ప్రశ్నించగా.. అవమానభారంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని బదులిచ్చారు. మోకాళ్ళపై తీవ్ర గాయాలు ఉన్నాయి. రక్తస్రావం జరిగింది’ అని రామాంజినమ్మ ఫోటోలను చూపించారు.

తన కుమారుడిని పోలీసులు, లారీ యజమాని చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆమె ఆరోపించారు. విషయం బయటకు వస్తుందని ఆత్మహత్య నాటకమాడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం స్పందన ఫిర్యాదు చేయడానికి ఎస్పీ దగ్గరకు వెళ్లగా తన ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. ఫిర్యాదు పత్రాన్ని పోలీసులతో వెనక్కి పంపించారని కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం జగన్ న్యాయం చేయాలని కోరారు. ఎస్పీకి బాధితురాలు సమస్యను వివరిస్తుండగా ఫోటోలు తీయడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను ఎస్పీ గన్ మెన్, పోలీసులు అడ్డుకున్నారు.

విద్యుత్ షాక్ తోనే మృతి..
చంద్రశేఖర్ నాయుడు విద్యుత్ షాక్ తోనే మృతి చెందారని తాడిపత్రి పట్టణ సిఐ ఆనందరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘శ్రావ్య లారీ ట్రాన్స్పోర్ట్ లో చంద్ర శేఖర్ డ్రైవర్. తమిళనాడుకు బండల లోడు తీసుకువెళ్లాడు. బాడుగ డబ్బు రూ.1.70 లక్షలను తీసుకొని లారీని వదిలేసి వెళ్లిపోయాడు. చంద్రశేఖర్ హైదరాబాదులో ఉన్నాడని తెలుసుకున్న ట్రాన్స్పోర్ట్ యజమానులు రాజశేఖర్, మనోహర్ నాయుడు, యాసీన్.. అతడిని తాడిపత్రి కి తీసుకు వచ్చారు. నందలపాడులోని పప్పూరు రోడ్డులో ఓ బండల పరిశ్రమలో బంధించి హింసించారు. వారికి భయపడిన చంద్రశేఖర్ సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీగలు పట్టుకుని చనిపోయాడు. పోస్టుమార్టం నివేదికలో ఇదే వెల్లడయ్యింది’ తెలిపారు. చంద్రశేఖర్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపినట్లు సిఐ వివరించారు.