ఏపీ సీఎం జగన్ కి బుల్లెట్ ప్రూఫ్ కారు అవసరమా?: రఘురామ
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు సీఎం వైఎస్ జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ కారు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: కరోనా చావులపై ఏపీ ప్రభుత్వం దొంగ లెక్కలు చూపిస్తోందని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ప్రశ్నించిన వారిపై రాజద్రోహ నేరాలు మోపుతున్నారని విమర్శించారు. రోడ్లపై అనాథలుగా రోగులు పడిగాపులుగాస్తున్నారన్నారు.
కేంద్రానికి లేఖ రాసేటప్పుడు 50 శాతం భరిస్తామని రాసి ఉంటే కేంద్రం అనుమతించేదని, మృత్యు గంటలు మోగుతుంటే జగన్ రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారన్నారు. చావును ఇంత దారుణంగా ప్రేమించేవారిని ప్రజలు చూడటం కష్టమన్నారు.
‘‘ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? ఇసుకలో ఎంత దొబ్బారో.. లిక్కర్‌లో ఎంత మేశారో అన్ని లెక్కలు బయటపెడతాం. వ్యాక్సిన్లు కొనడానికి డబ్బులు లేవు కానీ సీఎంకు ఆరున్నర కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కారు అవసరమా? రాష్ట్రం సంక్షోభంలో ఉంటే హెలికాప్టర్‌లు, ప్రయాణ ఖర్చులతో రాష్ట్ర నిధిని దుబారా చేస్తున్నారు’’ అని రఘురామ అన్నారు.
వైసీపీ నుంచి గెలిచిన రఘురామకృష్ణమ రాజు చాలా కాలంగా వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆస్తుల కేసులో జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపై విచారణ సాగుతోంది.