వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పెళ్లికానుక, షాదీ ముబారక్ సాయంపై లేఖ రాశారు. శుక్రవారం వృద్ధాప్య పింఛన్లపై జగన్ కు ఆయన లేఖ రాసిన విషయం తెలిసిందే.
వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సమరం కొనసాగించే ఉద్దేశంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ ఆయన జగన్ కు లేఖలు సంధిస్తూ వస్తున్నారు. శుక్రవారం ఆయన వృద్ధాప్య పింఛన్లపై జగన్ కు లేఖ రాశారు. శనివారంనాడు పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాలపై లేఖను సంధించారు.
అధికారంలోకి వస్తే పెళ్లి కానుక సాయం పెంచుతామని వైసీపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆ సాయాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని ప్రకటించిందని చెప్పారు. పెళ్లి కానుక సాయం పెంపుపై ప్రజల నుంచి ఎన్నికల్లో మద్దతు లభించిందని, అందువల్ల ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. ఏపీలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఆయన జగన్ ను కోరారు.
ఇదిలావుంటే, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన శుక్రవారం జగన్ కు రాసిన లేఖలో గుర్తు చేసిన విషయం తెలిసిందే. వృద్ధాప్య పింఛన్లను ఈ నెల నుంచి రూ.2,750కి పెంచి ఇవ్వాలని ఆయన జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఏడాదిగా పెండింగులో ఉన్న పింఛనును కూడా కలిపి రూ. 3 వేలు ఇవ్వాలని ఆయన కోరారు.
తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛనును రూ. 2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో వైసీపి హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ హామీకి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించిందని ఆయన అన్నారు.
