స్పీకర్ పై తమకు నమ్మకం పోయిందన్నారు. అందుకనే అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.

స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతోంది. సభలో తాజాగా జరిగిన ఘటనల తర్వాత వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. సభ నుండి వాకౌట్ చేసిన తర్వాత జగన్ మాట్లాడుతూ స్పీకర్ పై నమ్మకం, విశ్వాసం పోయింది కాబట్టే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. సభలో అగ్రిగోల్డ్ బాధితులపై చర్చ జరుగుతోంది. జగన్ మాట్లాడుతూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య కూడా తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. దాంతో చర్చ అనేక మలుపులు తిరిగింది.

ఎప్పుడైతే జగన్ ఆరోపణలు మొదలుపెట్టారో అగ్రిగోల్డ్ బాధితులపై చర్చ పక్కదారి పట్టింది. అధికారపార్టీ అంశాన్ని తెలివిగా పక్కదారి పట్టించింది. రాజీనామాలు, రాజకీయాల నుండి తప్పుకోవటాలు, హౌస్ కమిటి లేదా జ్యుడీషియల్ విచారణ, సభ నుండి వెలి లాంటి అంశాలతొ సభ అట్టుడికిపోయింది. సందట్లో సడేమియా లాగ ఎప్పుడో అయిపోయిన మహిళలపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు కూడా సభలో ప్రస్తావన వచ్చింది.

దాంతో స్పీకర్ తో సహా మంత్రులు, సభ్యులు జగన్ మీడియాపై తమ అక్కసు వెళ్ళగక్కారు. జగన్ మీడియాపై చర్యలు తసుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేసారు. జరగబోయేదాన్ని ముందే గ్రహించిన జగన్ సభనుండి వాకౌట్ చేసారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ పై తమకు నమ్మకం పోయిందన్నారు. అందుకనే అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.