ఎవరో ఏదో చెప్పారని ప్రభుత్వ నిర్ణయాలు మారవన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఎవరితో సంప్రదించాలో వారితో సంప్రదించిన తర్వాతే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌పై పార్టీ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. కర్నూలుకు న్యాయ రాజధానిని తీసుకెళ్లాలా వద్దా అనేది కేంద్రం, సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయమన్నారు.

అయితే తమ ఆలోచన మాత్రం కర్నూలుకు వెళ్లడమేనని విజయసాయి కుండబద్ధలు కొట్టారు. టీడీపీ ఇక సమాధి అయినట్లేనని.. చంద్రబాబు ఇక అధికారంలోకి రాలేరని ఆయన జోస్యం చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం అనుకున్నట్లే జరుగుతాయని విజయసాయిరెడ్డి వెల్లడించారు. చంద్రబాబు అన్నింటిని నెగిటివ్‌గానే ఆలోచిస్తారని విమర్శించారు. ఆయనలో ఉన్న మూర్ఖత్వం, దుర్మార్గపు ఆలోచన పోనంతవరకు ఆయన, ఆ పార్టీ మనుగడ కష్టమని విజయసాయి అభిప్రాయపడ్డారు.