వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85కి పెంచితే ప్రతాప్ రెడ్డితో కేసు వేయించి కొట్టేయించి, మళ్లీ ఇప్పుడు ఎలా తగ్గిస్తారంటూ బీసీ నాయకులను రెచ్చగొడుతున్నారని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేసారు. 

‘స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85  శాతానికి ఎలా పెంచుతారని ప్రతాపరెడ్డి తో కేసు వేయించి కొట్టేయిస్తాడు. మళ్లీ బిసి నాయకులను ఉసిగొల్పి కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారని లిటిగేషన్ మొదలు పెడతాడు. ఎన్నికలు జరగొద్దనేది అసలు ఉద్దేశం. సిగ్గు,శరం లేని మనిషి’ అని ట్వీట్‌ చేశారు. 

ఇక మరో ట్వీట్లో యస్‌ బ్యాంక్‌ సంక్షోభంపై స్పందించారు. దేశ వ్యాప్తంగా యస్ బ్యాంకు కుంభకోణం పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు. 

ట్విట్టర్ వేదికగా ఆయన నిప్పులు చెరిగారు. 'చంద్రబాబు యస్‌ బ్యాంకును అడ్డం పెట్టుకునీ రాష్ట్రాన్ని లూటీ చేశాడు. రూ.1,300 కోట్ల  టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు.

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. యస్‌ బ్యాంక్‌కు ఏపీ టూరిజం శాఖ నిధులను కూడా దోచిపెట్టాడు. ఇంకెన్ని ఉన్నాయో?' అంటూ విరుచుకుపడ్డారు.  ఇందుకు ఆధారంగా ఆయన యస్‌ బ్యాంకుకు సంబంధించిన ఓ స్క్రీన్‌ షాట్‌ను కూడా  పోస్ట్ చేశారు.