104 నెంబర్ కు స్వయంగా అధికార వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ చేసినా ఉలుకుపలుకు లేకుండాపోయింది.   

విశాఖపట్నం: కరోనా కష్టకాలంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన 104సర్వీస్ పనిచేయకుండా మొండికేసింది. ఈ నెంబర్ కు స్వయంగా అధికార వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ చేసినా ఉలుకుపలుకు లేకుండాపోయింది. దీంతో ఆయన సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇవాళ(శుక్రవారం) ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఆయన అక్కడే ఉన్న 104 కంట్రోల్‌ రూమ్‌ని సందర్శించారు. కాస్సేపు కంట్రోల్ రూంలోనే వున్నా ఒక్క కాల్‌ కూడా రాకపోవడంతో అనుమానంతో స్వయంగా తానే 104కి ఫోన్‌ చేశారు. ఎన్నిసార్లు ఈ నెంబర్ కు ఫోన్ చేసినా కనెక్ట్ కాలేదు. ఇలా దాదాపు 20నిమిషాలు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

వెంటనే విజయసాయి రెడ్డి కేంద్రస్థాయిలో 104ని పర్యవేక్షిస్తున్న సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఎ.బాబుకి కాల్‌ చేసి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. సర్వర్‌లో తాత్కాలికంగా సాంకేతిక లోపం తలెత్తడం వల్ల కాల్స్‌ ఆలస్యమవుతున్నాయని బాబు ఎంపీకి వివరణ ఇచ్చారు. వెంటనే ఈ సమస్యను సరిదిద్దాలని విజయసాయిరెడ్డి అధికారులకు సూచించారు.