తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా సోషల్ మీడియా సాక్షిగా విమర్శలు చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా టీడీపీ యువనేత నారా లోకేశ్‌ను టార్గెట్ చేశారు.

గ్రామ వాలంటీర్ల పోస్టులపై లోకేశ్ ‌వ్యాఖ్యల నేపథ్యంలో విజయసాయి గట్టి కౌంటరిచ్చారు. ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థం కావడం లేదంటూ ప్రతిరోజూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇక చాలు.

దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీది. గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలపై అభాండాలు వేస్తున్నావు. కావాలంటే దరఖాస్తు పెట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లిరా అంటూ సెటైర్లు వేశారు.

అలాగే అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయింపులు సరిగా లేవన్న చంద్రబాబు వ్యాఖ్యలపైనా విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. అమరావతి శంకుస్థాపనకే 300 కోట్లు నాకేసిన చంద్రబాబు గారికి బడ్జెట్లో 500 కోట్ల కేటాయింపు చాలా చిన్నదిగా అనిపించడం సహజమే.

లక్ష కోట్లతో రాజధాని అంటూ మాయాబజారును కళ్ళకు కట్టారు. రాజధాని పేరుతో లెక్కలేనన్ని విదేశీ పర్యటనలు చేశారు. విదేశీ బృందాలతో గ్రాఫిక్స్ ప్రదర్శనలు తప్ప చేసిందేమిటి అంటూ ట్వీట్ చేశారు.