వైసీపీ ఫైర్ బ్రాండ్ రఘురామ కృష్ణంరాజు మరోసారి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్ధితి నెలకొందన్నారు. అలాంటిది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజధాని తరలింపు సరికాదని ఆయన హితవు పలికారు.  

అయినా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూపోతే బాగోదన్నారు. అలాగే అమరావతిపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు సరికావని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

రైతులకు న్యాయం చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని.. అమరావతిలో రాజధాని వస్తుందని మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్ముతో భూములు కొన్నారని, దయచేసి వారికి ఇబ్బంది కలిగించొద్దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:వేట కుక్కలై వేటాడే రోజు వస్తోంది: రఘురామకృష్ణంరాజు సంచలనం

అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో తెలపాలని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించడాని రఘురామ స్వాగతించారు. రాజధాని వ్యవహారంపై రిఫరెండానికి వెళ్లాలని జగన్ ప్రభుత్వాన్ని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం వల్ల ప్రభుత్వానికే నష్టం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. దూరదృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తిని బెదిరించడం సరికాదని, తనను సైతం చాలాసార్లు బెదిరించారని రఘురామకృష్ణంరాజు గుర్తుచేశారు.