ఆంధ్ర ప్రదేశ్ కు చెెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి పెను గండం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు గురువారం అర్ధరాత్రి ప్రమాదానికి గురయ్యింది. 

నెల్లూరు : అధికార వైసిపి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గురువారం అర్ధరాత్రి ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం.

విజయవాడ నుండి నెల్లూరుకు గురువారం రాత్రి బయలుదేరారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. అయితే అర్ధరాత్రి ఎమ్మెల్యే కారు వేగంగా వెళుతుండగా ఓ లారీ అడ్డువచ్చింది. ఈ లారీ టైర్ పంక్ఛర్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించగా వెనకాలే వున్న ఎమ్మెల్సీ కారు అదుపుకాలేదు. అదే వేగంతో దూసుకువచ్చి లారీ వెనకబాగాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో ఎమ్మెల్సీ తలకు తీవ్ర గాయాలవగా ఆయన పీఏ ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. 

కారు ప్రమాద సమయంలో ఎమ్మెల్సీతో సహా ఐదుగురు వున్నట్లు సమాచారం. గాయపడిన అందరూ నెల్లూరు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చికిత్స పొందుతున్నారని... ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. 

ఈ యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఎమ్మెల్సీ పీఏ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఈ కారు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.