Asianet News TeluguAsianet News Telugu

ఆ వైసిపి ఎమ్మెల్యే ఆంధ్రా డేరా బాబా..: పంచుమర్తి అనురాధ సంచలనం

మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్ పై స్పందిస్తూ వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై విరుచుకుపడ్డారు టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ. 

ycp mla vasantha krishna prasad is a andhra dera baba... tdp panchumarthi anuradha akp
Author
Vijayawada, First Published Jul 30, 2021, 2:35 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: ఓబుళాపురం మైనింగ్ దోపిడీని ప్రజలు మర్చిపోకముందే అంతకుమించిన దోపిడీ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో  కృష్ణా జిల్లా మైలవరంలో జరగడం దురదృష్టకరమని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు. ఇంత దోపిడీని మీరే చేస్తూ... దానికి గతేడాది రూ.10 లక్షలు పెనాల్టీ కూడా కట్టి వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా మళ్లీ మైనింగ్ దోపిడీని మొదలు పెట్టారని ఆరోపించారు.  ఇంజనీరింగ్ విద్యార్థులను చంపేసిన రౌడీ షీటర్లు, రేప్ కేస్ నిందితులు, ఇసుక దందా రాయుళ్లను పక్కన పెట్టుకుని మైనింగ్ దోపిడీ చేస్తున్న కృష్ణ ప్రసాద్ నీతులు చెబితే ఎవరు నమ్ముతారు? అంటే అనురాధ మండిపడ్డారు. 

''ప్రెస్ ముందు గొంతు చించుకుంటే నిజాలు అబద్ధాలు కావు. వసంత కృష్ణ ప్రసాద్ ఆంధ్రా డేరా బాబా అని మైలవరం ప్రజలే చెబుతున్నారు. ప్రజల సొమ్మును కాపాడేందుకు దేవినేని ఉమా మిమ్మల్ని ప్రశ్నించినందుకు కక్షకట్టారు. అక్రమ కేసులు బనాయించి జైలు పాల్జేశారు. 1988లో దళిత మహిళను వసంత కృష్ణ ప్రసాద్ కుటుంబం పొట్టన పెట్టుకుంది వాస్తవం కాదా? ఓ టీచర్ ను హత్య చేసిన కేసులో ముద్దాయిగా ఉండి నందిగామ సబ్ జైలుకు వెళ్లిన మీరా నీతులు చెప్పేది?'' అని ప్రశ్నించారు. 

''వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకుని ల్యాంకో హిల్స్ లో తక్కువ రేటుకే భూములు కొని ఏ రకంగా సొమ్ములు చేసుకున్నారో అందరికీ తెలుసు. ల్యాంకో హిల్స్ నుంచి కొండపల్లి హిల్స్ వరకూ వసంత కుటుంబ అవినీతి సొమ్ము కూడబెట్టింది. మీ అవినీతిని ప్రశ్నిస్తే బెదిరించి జైలు పాల్జేస్తారా? మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లు ఎవరూ లేరు'' అన్నారు. 

''మనీ లాండరింగ్ కేసుల్లో వసంత కృష్ణ ప్రసాద్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మైలవరం నియోజకవర్గంలో సెంటు భూమికి సంబంధించిన 400 ఎకరాల్లో మీరు డబ్బులు కొట్టేశారని స్థానిక ప్రజలే చెబుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మైనింగ్ అక్రమాలపై ప్రధాని, కేంద్ర అటవీశాఖకు ముఖ్యమంత్రితో లేఖ రాయించండి'' అని సూచించారు.

''మాపై లేని బురద ఎలా జల్లుతారు? ఎవరిని మభ్య పెట్టేందుకు ఇవన్నీ చేస్తున్నారు? కొండపల్లి బొమ్మలను తయారు చేసే చెట్లను నరికేసి దందాలు, మైనింగ్ తో వేల కోట్లు కొల్లగొడుతున్నారు. కొండపల్లి బొమ్మలు తయారుచేసే వారి పొట్ట కొడుతున్నారు.  పాపతివాని-కపిలవాయి సత్రంలో దేవాదాయ భూముల్లో మీరు మైనింగ్ చేస్తోంది నిజం కాదా? ఏ భూమిని మీరు వదిలిపెట్టారు?'' అని నిలదీశారు. 

read more  దేవినేని ఉమా బెయిల్ పిటిషన్... విచారణ మంగళవారానికి వాయిదా

''నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని చేశారా మీరు? మైలవరం నియోజకవర్గానికి రూ. 60 లక్షల ఉపాధి నిధులను కూడా తేలేకపోయిన వసంత కృష్ణ ప్రసాద్ నీతులు చెప్పడమేంటి? మీరు చేసిన అవినీతిని ప్రశ్నించిన దేవినేని ఉమా, టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికార మదంతో విర్రవీగుతున్నారు. మీడియాతో లైవ్ లో మాట్లాడుతున్న దేనినేని ఉమా మీ పార్టీ వాళ్లపై దాడి ఎలా చేస్తారు?'' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

''వీటీపీఎస్ బూడిద కోసం ప్రభుత్వ సలహాదారు దగ్గర మీరు చేసిన పంచాయతీలు రాష్ట్ర ప్రజలకు తెలీదనుకుంటున్నారా? నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే లోకేష్ భాషపై  విమర్శలు చేసే స్థాయి వసంత కృష్ణ ప్రసాద్ కు లేదు. సుహృద్భావం, సార్వభౌమాధికారం అనే పదాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో  చెప్పించండి చూద్దాం. లోకేష్ గారు తెలుగు చక్కగా మాట్లాడతారు. ప్రశ్నా పత్రాలు దొంగిలించి, వాటిని అమ్ముకున్న మీ నేతకు తెలుగు ఎంత బాగా వచ్చో రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. వైసీపీ నేతలకు వచ్చింది తెలుగు కాదు...బూతుల భాష. బూతులపై మీరంతా పీహెచ్ డీలు చేసేశారు'' అని ఎద్దేవా చేశారు. 

''వైఎస్ హయాంలో తక్కువ ధరలకు భూములు కొని మీరు చేసిన అక్రమాలు, భూ కబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? కేతనకొండలో మీరు చేసిన ఇసుక మాఫియాల గురించి రాష్ట్రమంతా తెలుసు. రౌడీ షీటర్లును, రేప్ కేసు నిందితులను వెనుకేసుకుని తిరిగే వసంత కృష్ణ ప్రసాద్ మాకు నీతులు చెప్పడమేంటి? వైసీపీలో ఎవరికి బినామీగా ఉంటే మీకు ఎమ్మెల్యే సీటు వచ్చిందో బయటపెట్టమంటారా? స్కామ్ లు, రాబరీలు, చీటింగ్ చేయడంలో వైసీపీ నేతలు సిద్ధహస్తులు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఇంటి పేర్లను అక్రమ మైనింగ్ గా మార్చుకోవాలి. తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం మీకు అలవాటుగా మారింది'' అని ఆరోపించారు. 

''రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన ముఖ్యమంత్రికి మీడియాను ఫేస్ చేసే ధైర్యం లేదు. రికార్డెడ్ ప్రెస్ మీట్లలోనూ తప్పుల తడకలు మాట్లాడుతున్నారు. యూట్యూబ్ చానల్ జర్నలిస్ట్ గంటా నవీన్ ఏమయ్యాడో వసంత కృష్ణ ప్రసాద్ సమాధానం చెప్పాలి. పార్లమెంటు చట్టాలను ఉల్లంఘించడం, దళితులను రక్షించే చట్టాలను అనుకూలంగా మలుచుకోవడం, పోలీసులను సొంత అవసరాలకు వాడుకోవడం దారుణం. దేవినేని ఉమాపై మాట్లాడే అర్హత వసంత కృష్ణ ప్రసాద్ కు లేదని ఆయన కుటుంబసభ్యులే చెబుతారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజా వ్యతిరేక విధానాలు కట్టిపెట్టండి. లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెబుతారు'' అని అనురాధ హెచ్చరించారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios