అనంతపురం: ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యేకే టోపీ పెట్టడానికి ప్రయత్నించాడు. మీ నియోజకవర్గానికి కోట్ల నిధులు ఇస్తున్నామని, అందుకు తొలుత మీరు ఫలానా ఖాతాకు డబ్బులు పంపాలని కొంత మంది ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసిన మోసాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలో అలాంటి మోసాలకు గురైనవారు ఉన్నారని తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసగాళ్ల చర్యలకు ఆడ్డుకట్ట పడింది.

తాజాగా, అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి నిధుల పేరుతో మోసం చేయడానికి ప్రయత్నించాడు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరు మోసం చేసేందుకు పూనుకున్నాడు. పారిశ్రామిక ప్రాజెక్టు డైరెక్టర్ పేరుతో శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ఉషశ్రీకి ఫోన్ చేసాడు. 

మీ నియోజకవ్రగానికి రూ.3 కోట్ల నిధులను కేంద్రం కేటాయించిందని ఆతను ఫోన్ చేసి ఎమ్మెల్యేకు చెప్పాడు. లబ్ధిదారుల వాటా కింద 10 శాతం చెల్లిస్తే యూనిట్ కు రూ.25 లక్షల రుణం ఇస్తామని చెప్పాడు. 

దాంతో అనుమానం వచ్చిన ఉషశ్రీ పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించారు. అటువంటి పథకమేదీ లేదని వారు ఆమెకు చెప్పారు. దాంతో ఎమ్మెల్యే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేసి నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.