గుంటూరు: ఇసుక విషయంలో వైసిపి సర్కార్ తీవ్ర అవినీతికి పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్వయంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలే ఇసుకను అక్రమంగా అమ్ముకుంటూ భారీగా సొమ్ముచేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఇలాంటి ఆరోపణలను నిజం చేసేలా గుంటూరు జిల్లాలో ఓ సంఘటన చోటుచేసుకుంది. 

అచ్చంపేట మండలం అంబడిపూడి ఇసుక రీచ్ లో జేపీ కన్ స్ట్రక్షన్ ఉద్యోగులతో పెదకూరపాడు వైసిపి ఎమ్మెల్యే నంబూరు శంకరావు అనుచరుడు వివాదానికి దిగాడు. దీంతో సదరు ఎమ్మెల్యే అనుచరుడు కంచేటి సాయి తమపై దౌర్జన్యానికి దిగినట్లు ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికి స్థానిక పోలీసులు కేసు నమోదు చెయ్యలేదు. 

ఈ వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న జేపీ కన్ స్ట్రక్షన్ ఉద్యోగులు పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. దీంతో వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సత్తెనపల్లి రూరల్ పోలీసుల కంచేటి సాయి అదుపులోకి తీసుకున్నారు. 

read more  రాష్ట్రమంతా ఇసుకకు ఒకే రేటు,ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు: ఏపీ సర్కార్

ఇదిలావుంటే కేవలం ఇసుకలోనే మరో రూ.10వేలకోట్ల దోపిడీకి ముఖ్యమంత్రి జగన్ మాస్టర్ ప్లాన్ వేశాడని మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ ఆరోపించారు. కాదేదీ కబ్జాకు అనర్హం... కాదేదీ దోపిడీకి అనర్హహమన్నట్లుగా జగన్ రెండేళ్ల పాలన సాగిందన్నారు.  

'' మంత్రుల పేరుతో ఉన్న బోర్డులు పెట్టుకొని మరీ ఇసుక లారీలు తిరుగుతున్నాయి. కడపకు చెందిన వ్యక్తులకు కొవ్వూరు, పోలవరంలో ఏం పని? జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరుతో వైసీపీ నేతలే హోల్ సేల్ ఇసుక దోపిడీకి తెరతీశారు'' అని మాజీ మంత్రి ఆరోపించారు. 

''18టన్నుల లారీకి  రూ.12,150వరకు వసూలు చేస్తున్నారు. అంటే టన్ను ఇసుక రూ.375 అని చెప్పిందంతా అబద్ధమేనా? తక్షణమే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలుచేయాలి. ఇళ్లు కట్టుకునేవారితో పాటు కట్టేవారిని కూడా ఏడిపిస్తున్నారు. రెండేళ్ల పాలనలో జగన్ ధనదాహానికి బలైన వర్గాల్లో భవననిర్మాణ కార్మికులు, రైతులు, దళితులే ముందున్నారు'' అని జవహర్ ఆరోపించారు.