మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ కి వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సవాలు విసిరారు. తమ సీఎం జగన్ పాలన చూసి లోకేష్, జగన్ లు భయపడుతున్నారని చెప్పారు. టీడీపీ వైఫల్యాలన్నింటినీ తమపైకి తోసేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిజాలను అంగీకరించకుండా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే.. టీడీపీ నేతలపై పలు విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా కూడా చంద్రబాబు, లోకేష్ లకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. జగన్ విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామన్నారు.

సీఎం జగన్‌పైనా, ఎంపీ విజయసాయిరెడ్డిపై లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న లోకేష్ దయచేసి తెలుగు నేర్చుకోవాలన్నారు. నాలుగు పదాలు సరిగ్గా పలకలేని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. లోకేష్ ప్రెస్‌మీట్ పెట్టి.. గుంటూరు, మంగళగిరి, డెంగ్యూ పదాలను పలకాలన్నారు. ఆయన మూడు పదాలను వరుసపెట్టి పలకలగలిగితే.. లోకేష్‌ను చంద్రబాబుకు నిజమైన రాజకీయ వారసుడిగా ఒప్పుకుంటామన్నారు.