అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైెస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధులపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితులకు ఎకరా భూమి కూడా ఇవ్వని చంద్రబాబు నేడు అసైన్డ్ భూముల గురించి మాట్లాడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైఎస్సార్ అనంతపురానికి నీరు ఇవ్వడం వల్లనే కియా పరిశ్రమ వచ్చిందని, చంద్రబాబు మొహం చూసి కాదని ఆయన అన్నారు .

Also Read: ట్రంప్ విందుకు జగన్ కు రాని ఆహ్వానం: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ప్రజా చైతన్య యాత్రలకు స్పందన లభించకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని, చంద్రబాబు చేసేది ప్రజా చైతన్య యాత్ర కాదు పచ్చి బూతుల యాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. మద్యపాన నిషేధం విధించాలని గతంలో ఈనాడు అధినేత రామోజీ రావు వార్తలు రాశారని, ఇప్పుడు ఆ సంగతి మరిచిపోయారని, ఎందుకు అలా మరిచిపోయారో తెలియదని ఆయన అన్నారు. 

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే పాస్ పుస్తకం కోసం లక్ష రూపాయలు లంచం ఇచ్చానని ఓ రైతు చెప్పాడని, చంద్రబాబు హయాంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఆ  రైతు మాటల వల్ల అర్థమవుతోందని ఆయన అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో మంచినీటి సమస్యను చంద్రబాబు తీర్చలేదని ఆయన విమర్శించారు. 

Also Read: చంద్రబాబు ఓటమి ట్రంప్ కు కోపం తెప్పించిందా...అందుకే జగన్ కు..: కన్నబాబు

బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు ఇవ్వవద్దని చంద్రబాబు కోర్టులో కేసు వేయించారని, చంద్రబాబు చేష్టలు చూసి మనిషి అనాలో పశువు అనాలో తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ట్రంప్ ను ఓడించాలని పిలుపునిచ్చారని, మళ్లీ ఈ రోజు ట్రంప్ గెలుపు గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్ారు. సీఎం వైఎస్ జగన్ ను ఢిల్లీలోని ట్రంప్ విందుకు పిలువకపోవడాన్ని రాజకీయం చేస్తున్నారని, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాత్రమే పిలిచారి, అది రొటేషన్ పద్ధతిలో జరిగే ప్రక్రియ అని ఆయన అన్నారు.