వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమయ్యారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణాల కోసం ఆర్థిక సహాయం అందజేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ భేటీలో ఇతర ఆలయాలను ప్రస్తావించారు.
అమరావతి: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో భేటీ అయ్యారు. తన నియోజకవర్గం నగరిలో ఆలయాల నిర్మాణాలు, అభివృద్ది పనులపై ఆయనతో చర్చించారు. ఈ నిర్మాణాలకు బోర్డు నుంచి ఆర్థిక సహాయం కొరకు వినతి పత్రం అందజేశారు. దీనితోపాటు తడుకు ఆర్ఎస్ నుంచి అప్పలాయగుంట వరకు రోడ్డు వెడల్పు పనులకూ ఆర్థిక సహాయం చేయాలని కోరారు. నిండ్రలోని పురాతన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం పునరుద్ధరణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, ముడిపల్లిలోని అతిపురాతన అగస్తీశ్వర స్వామి ఆలయం, కరియ మాణిక్య స్వామి ఆలయాలను దేవస్థానాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. నగరి దేశమ్మ ఆలయానికి దేవాదాయ శాఖ కామన్ గుడ్స్ ద్వారా నిధులు మంజూరు అయ్యాయని, అయినప్పటికీ టీటీడీ ద్వారానే పనులు జరిపించాలని కోరారు. సంబంధిత వినతిపత్రాలను అందజేశారు. వీటితోపాటు ఇతర అభివృద్ధి విషయాలనూ ముఖాముఖిగా చర్చించారు. వీరి భేటీలో రాజకీయాంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.
