ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి కనీసం వారం రోజులైనా గడవలేదు. అప్పుడే వైసీపీ ఎమ్మెల్యే ఒకరు వివాదంలో ఇరుక్కున్నారు.  విజయనగరం జిల్లా కురుపాం ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన పాముల పుష్పశ్రీవాణిపై కులవివాదం నెలకొంది. ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి గిరిజన సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.

కురుపాలెం ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి 2014లో తొలిసారి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె మొన్నటి ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు.గత ఎన్నికల సమయంలోనే  ఆమె ఎస్టీ కాదంటూ టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారు. కోర్టు పరిశీలనలో ఈ వివాదం ఉంది. ఈ ఎన్నికల్లోనూ నామినేషన్ దశలో మరోసారి వివాదం తలెత్తింది.

నామినేషన్ పరిశీలన ఏప్రిల్ 26వ తేదీన పుష్పశ్రీవాణి అందజేసిన కులధ్రువీకరణ పత్రం అర్హతను ప్రశ్నిస్తూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజు రిట్నింగ్ అధికారి విశ్వేశ్వరరావుకి అభ్యంతర ప్రతం అందజేశారు. కొండదొర తెగల వారు విధిగా ఆర్టీవో స్థాయి అధికారి నుంచి కులధ్రువీకరణ పత్రం పొందాలని రాజ్యాంగం చెబుతోందని.. తహశీల్దార్ నుంచి 2013లో పొందిన ధ్రవీకరణ పత్రం జిరాక్స్ కాపీని అందజేసిందున నామినేషన్ తిరస్కరించాలని జయరాజు డిమాండ్ చేశారు.

అయితే, రిటర్నింగ్ అధికారి తమ వాదనను విచారణ చేయకుండా నామినేషన్ ను ఆమోదించడంపై కోర్టులో తేల్చుకోవడానికి ఏర్పాటు చేసుకుంటుననారు. పశ్చిమగోదావరి జిల్లా కోటసీతారాంపురం ఐడీడీఏలో ఎస్టీ కోటాలో పుష్పశ్రీవాణి సోదరి పాముల రామతులసి కొన్నాళ్ల క్రితం ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.

కాగా, ఆమె నిజమైన ఎస్టీ కాదని కొందరు  అక్కడి ఐటీడీఏ పీవోకు లిఖిత పూర్వకంగా లేఖ రాశారు.ఆ మేరకు విచారణ జరిపిన అధికారులు రామతులసి ఎస్టీ తెలగలకు చెందిన వారు కాదని నిర్ధారించారు. ఎంపికైన ఉపాధ్యాయ నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  సోదరి ఎస్టీ కానప్పుడు పుష్పశ్రీవాణి మాత్రం ఎస్టీ ఎలా అవుతుందని అక్కడి వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.