Asianet News TeluguAsianet News Telugu

ఇలా చేయమని  సీఎం కార్యాలయమే చెప్పిందా.?: ఏలూరు కలెక్టర్ పై మాజీ మంత్రి గరం (వీడియో)

ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, అధికార వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య వివాదం కొనసాగుతోంది. జడ్పి సమావేశానికి ఏలూరు కలెక్టర్ హాజరుకావాల్సిందేనని మాజీ మంత్రి పట్టుబడుతుంటే...  కలెక్టర్ మాత్రం గైర్హాజరు అవుతూనే వున్నారు. 

YCP MLA Perni Nani Serious on Eluru Collector AKP
Author
First Published Nov 14, 2023, 3:03 PM IST

విజయవాడ : మాజీ మంత్రి, అధికారపార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ పై సీరియస్ అయ్యారు. గతంలో కూడా ఏలూరు కలెక్టర్ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రాకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసారు. మళ్లీ ఈ సమావేశానికి కలెక్టర్ గైర్హాజరయితే నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళతానని... ఇంటి ముందు కూర్చుని నిరసన చేపడతానని హెచ్చరించారు. అయినప్పటికీ ఇవాళ చేపట్టిన జడ్పి సమావేశానికి ఏలూరు కలెక్టర్ వెంకటేశ్ హాజరుకాకపోవడంతో మాజీ మంత్రి చిర్రెత్తిపోయారు. 

వ్యవస్థలంటే లెక్కలేనితనంతో ఏలూరు కలెక్టర్ వ్యవహరిస్తున్నారని పేర్ని నాని అన్నారు. జిల్లా పరిషత్ మీటింగులకు హాజరయ్యే ఉద్దేశం కలెక్టర్ కు లేదా? అదయినా సూటిగా చెబితే మేం ఏం చేయాలో చేసుకుంటామని అన్నారు. జిల్లా కలెక్టర్ అయినంతమాత్రాన నియంతలా వ్యవహరించకూడదని... ప్రభుత్వ పాలనలో ఆయన ఓ భాగం మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు. బరితెగింపుతనం ఎవరికీ మంచిదికాదు... ప్రజలకు సేవ చేసే ఉద్యోగులకు మరీ మంచిది కాదని పేర్ని నాని సూచించారు. 

Read More  దేవినేని ఉమకు పశు వైద్యులతో చికిత్స... అది తగ్గాలంటే ఇదే ట్రీట్మెంట్ : ఎమ్మెల్యే వసంత ఎద్దేవా (వీడియో)

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు పరిషత్ సమావేశానికి హాజరవుతున్నపుడు ఒక్క ఏలూరు కలెక్టర్ మాత్రం గైర్హాజరు కావడం ఏమిటని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక స్పందిస్తూ... ఇరిగేషన్ బోర్డ్ అడ్వైజరీ కమిటీ సమావేశం వుందని ఏలూరు కలెక్టర్ చెప్పారన్నారు. అంతకంటే ముఖ్యమైన పరిషత్ సమావేశానికి హాజరుకాకపోవడం ఎంతవరకు సమంజసమని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

వీడియో

ప్రాధాన్యత కలిగిన జడ్పీ సమావేశానికి కలెక్టర్ వెంకటేశ్ రాకుండా, కింది స్థాయి అధికారులను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుని వెళతానని అన్నారు.  

జడ్పీ సమావేశానికి రాకూడదనే  అదేరోజు ఇరిగేషన్ బోర్డ్ ఏర్పాటుచేసారా? అంటూ కలెక్టర్ ను ప్రశ్నించారు పేర్నినాని. ముఖ్యమంత్రి కార్యాలయమే సలహా మండలి సమావేశం పెట్టుకోవాలని ఆదేశించినట్లు ఏలూరు కలెక్టర్ చెబుతున్నారట... మరి జడ్పి సమావేశానికి గైర్హాజరు కమ్మని కూడా సీఎంవో చెప్పిందా? అని అడిగారు. అంత అర్జెంట్ అయితే నిన్ననే సలహా మండలి సమావేశం ఏర్పాటుచేసుకోవచ్చే కదా? ఇవాళ జడ్పి సమావేశం వుందని తెలిసికూడా ఆ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటుచేసారు? అంటూ ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ పై ఎమ్మెల్యే నాని సీరియస్ అయ్యారు.   
 

Follow Us:
Download App:
  • android
  • ios