సొంత జిల్లాలోనే చంద్రబాబుకు షాక్

Ycp mla peddireddy jolts Naidu in the own district
Highlights

  • సొంత జిల్లాలో చంద్రబాబునాయుడుకు వైసిసి నేతలు పెద్ద షాకే ఇచ్చారు.

సొంత జిల్లాలో చంద్రబాబునాయుడుకు వైసిసి నేతలు పెద్ద షాకే ఇచ్చారు. టిడిపి-వైసిపిలు ఒకదాన్ని మించి మరోటి ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. అందులో భాగంగానే వైసిపి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని టిడిపిలోకి చేర్చుకున్నారు. దశాబ్దాలుగా పీలేరు నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న నల్లారి కుటుంబంకు జిల్లాలో ఉన్న ఫాలోయింగ్ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి ఏ ఉద్దేశ్యంతో కిషోర్ ను పార్టీలోకి చేర్చుకున్నారో ఎవరికీ తెలీదు. టిడిపిలోని అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఏ మేరకు దెబ్బతీస్తారన్నది  వేచిచూడాల్సిందే.

సరే, ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఏకంగా చంద్రబాబుకే పెద్దిరెడ్డి షాక్ ఇచ్చారు. టిడిపిలోని సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ, మాజీ జడ్పి ఛైర్మన్ జివి శ్రీనాధరెడ్డి ఇంటికి స్వయంగా పెద్దిరెడ్డి వెళ్ళారు. జివి ఇంటికి పెద్దిరెడ్డి ఎందుకు వెళ్ళారన్నది బహిరంగ రహస్యమే. కిషోర్ టిడిపిలో చేరిన దగ్గర నుండి జివి కుంటుంబం, బంధుగణంతో పాటు మద్దతుదారులు చంద్రబాబుపై మండిపోతున్నారు. ఎందుకంటే, కిషోర్ చేరిక విషయంలో చంద్రబాబు మాటమాత్రంగా కూడా జీవితో ప్రస్తావించలేదట. దాంతో అప్పటి నుండి జీవి, మద్దతుదారులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

సరే, అసంతృప్తి అన్నది దాచినా దాగదు కదా ? జీవి విషయంలో కూడా అదే జరిగింది. ఆనోటా ఈనోటా విషయం పెద్దిరెడ్డికి చేరింది. వెంటనే పై స్ధాయిలో మాట్లాడితే అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. దాంతో శనివారం అర్ధరాత్రి స్వయంగా పెద్దిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి జీవి ఇంటికి వెళ్ళి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. టిడిపిలో నుండి వైసిపిలోకి మారటానికి జీవి కూడా అంగీకరించినట్లు సమాచారం. బంధువులు, మద్దతుదారులు కూడా పూర్తి మద్దతు తెలిపారట.

విషయం బయటకుపొక్కగానే టిడిపి జిల్లా నాయకత్వం ఉలిక్కిపడింది. వెంటనే విషయాన్ని అమరావతిలోని ముఖ్యులకు చేరవేశారు. అమరావతి నుండి వచ్చిన  ఆదేశాలతో జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని వెంటనే జీవి ఇంటి వద్ద వాలిపోయారు. చాలాకాలంగా చంద్రబాబు కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు కాబట్టే పార్టీ మారటానికి నిర్ణయించుకున్నట్లు తెగేసి చెప్పారట జీవి. దాంతో ఏం సమాధానం చెప్పలేక నాని బయటకు వచ్చేసారట. మొత్తానికి ‘మబ్బులను చూసి ముంతలో నీరు వొలకబోసుకున్నట్లు’గా ఉంది చంద్రబాబు వ్యవహారమని జిల్లా టిడిపి నేతలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.

loader