చంద్రబాబునాయుడును కలసిన గుంటూరు తూర్పు వైసిపి ఎంఎల్ఏ ముస్తాఫా తర్వాత వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎప్పుడైతే ముస్తాఫా సిఎంను కలిసారో పెద్ద కలకలం రేగింది. ఎందుకంటే, ఎప్పటి నుండో వైసిపి ఎంఎల్ఏ టిడిపిలోకి ఫిరాయించేస్తారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నేపధ్యంలోనే గుంటూరుకు వచ్చిన సిఎంను ముస్తాఫా కలవటంతో సంచలనంగా మారింది. అందులోనూ నరసరావుపేట టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు కారులో వెళ్ళి సిఎంను కలిసారు. ఇంకేముంది ఒకటే వారిద్దరి భేటీ వైరల్ గా మారింది.

తర్వాత తనపై జరుగుతున్న ప్రచారాన్ని ముస్తాఫా తెలుసుకున్నారు.  ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ, తానెప్పటికీ వైసిపిలోనే ఉంటానని చెప్పారు. టిడిపిలోకి రామ్మంటూ రాయపాటి గతంలోనే ఆహ్వానించినా తాను వైసిపిలోనే ఉంటానని స్పష్టం చేసినట్లు తెలిపారు. అదే విషయాన్ని తర్వాత జగన్ కు కూడా ఎంఎల్ఏ ఫోన్ చేసి చెప్పారు. ఒకవేళ పార్టీ మారాల్సిన రోజు  వస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతానే కానీ టిడిపిలో మాత్రం చేరనని తెలిపారు. ముస్తాఫా మాటలు ఎంత వరకూ నిజమో కాలమే చెప్పాలి.