గుంటూరు: గుంటూరు జిల్లాలోని గురజాలలో ప్రతిపక్ష, అధికార పక్ష నేతల మధ్య విమర్శలూ ప్రతివిమర్శలూ కొనసాగుతున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

బాలకృష్ణలా మీసాలు తిప్పడం, బ్రహ్మానందంలా తొడ కొట్టడం కుదరదని ఆయన అన్నారు. తన ఇంట్లో చంటోళ్లు కూడా భయపడరని ఆయన అన్నారు. యరపతినేని బహిరంగ సభలో వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ తొడ కొట్టిన విషయం తెలిసిందే. దానిపై ప్రతిస్పందిస్తూ కాసు మహేష్ రెడ్డి అన్నారు.

See Video: జగన్ సర్కార్ పై ఆగ్రహం... మీసం తిప్పి తొడగొట్టిన యరపతినేని

జమిలి ఎన్నికలు యరపతనేని భావిస్తున్నట్లుగా రావని ఆయన అన్నారు. 2025, 2026ల్లో జమిలి ఎన్నికలు వస్తాయని ఆయన చెప్పారు. శాసనసభ ఎన్నికలు వాయిదా పడుతాయని, ఈ విషయం తెలిస్తే టీడీపీ నాయకుల గుండెలు ఆగిపోతాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలువలేనని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇక్కడికి వస్తాడేమోనని ఆయన అన్నారు. 

2022, 2023ల్లో జమిలి ఎన్నికలు వస్తాయని, అప్పుడు వైసీపీ అవినీతి పాలన అంతు చూస్తామని యరపతినేని అన్నారు. ఎమ్మెల్యే వారాలబ్బాయిగా మారాడని కూడా ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాసు మహేష్ రెడ్డి స్పందించారు.