స్వయంగా ఎన్నికల కమిషనర్ స్థానంలో ఉండి ఓటు హక్కును ట్రాన్స్ ఫర్ చేసుకోవడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో చేతగాని వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను చంద్రబాబు ఈసీగా నియమించారని.. దీనినిబట్టి ఆయన సమర్థత ఏమిటో అర్థమవుతుందన్నారు జోగి రమేష్. 

అమరావతి: ఓటు హక్కును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ చేసుకునే విధానం కూడా తెలియని ఒక అసమర్థమైన వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్ గా ఉండటం దురదృష్టకరమని వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. స్వయంగా ఎన్నికల కమిషనర్ స్థానంలో ఉండి ఓటు హక్కును ట్రాన్స్ ఫర్ చేసుకోవడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో చేతగాని వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను చంద్రబాబు ఈసీగా నియమించారని.. దీనినిబట్టి ఆయన సమర్థత ఏమిటో అర్థమవుతుందన్నారు జోగి రమేష్. 

''ఎస్ఈసీ నిమ్మగడ్డ హైదరాబాద్ లో స్థిర నివాసం ఉంటూ సొంత గ్రామమైన దుగ్గిరాలలో ఓటు హక్కు అడగటమే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కు వ్యతిరేకం. ఓటు హక్కును తన సొంత గ్రామానికి మార్చుకునేందుకు అవసరమైన విధివిధానాలేమిటో కూడా కనీసం తెలియని, ఆ మాత్రం జ్ఞానం లేని వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు. కనీసమైన రూల్స్ తెలియని వ్యక్తి మన ఎన్నికల కమిషనర్ గా ఉండటం, ఇటువంటి అసమర్థుడిని ఎన్నికల కమిషనర్ గా చంద్రబాబు నియమించటం వల్లే మనకు ఈ ఖర్మ పట్టింది'' అని మండిపడ్డారు. 

''రోజూ జిల్లాలు తిరుగుతూ చట్టం, రాజ్యాంగం అని నీతి కబుర్లు చెబుతున్న నిమ్మగడ్డ ఈరోజు ఒక విచిత్రమైన ఆర్డర్ ఇచ్చారు. చిత్తూరు, గుంటూరు జిల్లాలో పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సంబంధించి.. ఆ ఏకగ్రీవ ఎన్నికల ఫలితాలను ప్రకటించవద్దని జిల్లా కలెక్టర్లను కోరారు. చిత్తూరు అంటే చంద్రబాబు గారి జిల్లా, గుంటూరు జిల్లా అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారి జిల్లా.. ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలు జరగటానికి వీల్లేదని మీరు ఇద్దరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారా..? ఇదెక్కడి దుర్మార్గం..?'' అని నిలదీశారు.

''జిల్లాల్లో ఎన్ని ఏకగ్రీవాలు జరగాలో, ఎన్ని జరగకూడదో నిర్ణయించడానికి, నిర్ణయించుకోవటానికి మీరు ఎవరు..? ఏకగ్రీవాలు కాకూడదని ఎక్కడైనా రూల్ ఉందా, ఏదైనా నిబంధన ఉందా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిగారూ.. ! కనీస రూల్స్ తెలియని మీరు ఎన్నికల కమిషనర్ అధికారిగా కుర్చీలో ఉండొచ్చుగానీ.. పంచాయితీలు ఏకగ్రీవంగా సమర్థుడైన వ్యక్తిని ఎన్నుకుంటే.. వద్దని చెప్పడానికి, చంద్రబాబుకు- మీకు ఏమిటి సంబంధం..? ఏకగ్రీవం అయిన చోట్ల.. ఏ ఒక్క అభ్యర్థి అయినా నామినేషన్ వెయ్యనివ్వడం లేదని, అడ్డుకున్నారని మీకు చెప్పారా..? లేదు కదా'' అని ప్రశ్నించారు. 

''పంచాయితీ ఎన్నికలు ఏకగ్రీవాలు చేయటానికి వీల్లేదని అంటున్న మీరు అది అప్రజాస్వామికం అనుకుంటే.. మీరూ, చంద్రబాబు కలిసి కోర్టులో రిట్ పిటీషన్ వేయండి. అడ్డుకోవడానికి మీరెవరు, మీకు ఉన్న అధికారాలేమిటి..? స్పీకర్, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, చివరికి రాష్ట్రపతి ఎన్నిక వరకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరగుతుంటాయి. ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఏకగ్రీవాలు వద్దని ఎన్నికల కమిషనర్, చంద్రబాబు చట్టం తెస్తారా..? ఏకగ్రీవాలు అప్రజాస్వామికం, అది తప్పు అని మీరు ఒక పాలసీని తీసుకురండి. ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారాలను, ప్రజల హక్కులను కాలరాయడానికి మీకు ఏం అధికారం ఉంది..? ఏకగ్రీవం ప్రజాస్వామికం అయినప్పుడు వద్దనటానికి మీరు ఎవరు..?'' అని అడిగారు.

read more నిమ్మగడ్డకు షాక్:ఈ వాచ్ యాప్ మీద హైకోర్టు కీలక ఆదేశాలు

''దుర్మార్గుల్లా ఒకవైపు రాష్ట్రంలో మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ శిఖండిల్లా రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేయడానికి మీకు అధికారాలు ఎవరిచ్చారు..? ప్రజలంతా ఈరోజున జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు మద్దతు ఇస్తుంటే.. శిఖండిని అడ్డుపెట్టుకుని ఎన్నికలు నడిపిస్తున్న చంద్రబాబా'' అని ఆరోపించారు. 

''ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కో, కోర్టుకో వెళ్ళి ఫలానా వ్యక్తి నేరం చేశాడు అని పోలీసు అధికారికో.. జడ్జి ముందుకో వెళ్ళి ఫిర్యాదు చేస్తే... నేరం చేసి ఉంటే నేరానికి శిక్ష విధించటం ఎక్కడైనా ఉంటుంది. అంతేగానీ, నేరాన్ని రద్దు చేశానని బుద్ధి, జ్ఞానం ఉన్నవాడు ఎవడూ అనడు. నేరాన్ని రద్దు చేశామని.. ఏ పోలీస్ స్టేషన్, ఏ కోర్టు చెప్పదు. విచిత్రమేమిటంటే.. మీరు అటువంటి పనులు చేయగల సమర్థులు కాబట్టే, మిమ్మల్ని చంద్రబాబు ఎన్నికల కమిషన్ కూర్చీలో కూర్చోబెట్టారు'' అంటూ నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు.

''రాష్ట్రంలో పార్టీల రహితంగా గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటే పార్టీ ప్రాతిపదిక మీద, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఎలా విడుదల చేస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేం ప్రశ్నించాం.. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశాం. మేనిఫెస్టోను విడుదల చేయడం చట్టబద్ధమా.. కాదా..? అని అడిగాం. ఎన్నికల కమిషన్ విధి ఏంటంటే.. అది చట్టబద్ధమో, కాదో చెప్పాలి. అలాకాకుండా, ఇప్పటికే విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోని రద్దు చేస్తున్నామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చెప్పటం ఏమిటి..? పార్టీల రహితంగా జరిగే పంచాయితీ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేయడం అన్నది చట్టవిరుద్ధం.. దాని మీద చర్యలు తీసుకోమని మేం కోరితే... చిత్తశుద్ధి ఉంటే టీడీపీ మీద చర్యలు తీసుకోవాలి. అది కాకుండా మేనిఫెస్టోను రద్దు చేయటం ఏమిటి..? ఇప్పటికే విడుదల చేసిన మేనిఫెస్టోని ఎలా రద్దు చేస్తారు.. ?'' అని ప్రశ్నించారు.

''తెలుగుదేశం పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా మేనిఫెస్టోను విడుద చేసింది కాబట్టి ఆ పార్టీ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలి. నిమ్మగడ్డ వ్యవహారం చూస్తుంటే ఆయన పిచ్చి పీక్ స్థాయికి వెళ్ళింది. ఎన్నికలు పూర్తైన తర్వాత ఆయన పిచ్చాసుపత్రికి వెళతారా.. మరెక్కడి వెళతారో చూడాలి. ఎన్నికల కమిషనర్ గా తనకు అధికారం ఉందని, అధికారులపై బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తూ, పంచాయితీలు ఏకగ్రీవం కాకుండా, పచ్చని గ్రామాల్లో చిచ్చు పెట్టే దుర్మార్గపు క్రీడను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం'' అన్నారు.

''పంచాయితీ మేనిఫెస్టో పేరుతో, చెత్త వాగ్దానాలు చేసి, టీడీపీ ప్రజలను ప్రభావితం చేసినప్పుడు .. ఆ పార్టీ మీద చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంది. అది చేయకుండా మేనిఫెస్టోను రద్దు చేస్తున్నామంటే ఎలా...? నారా చంద్రబాబు నాయుడు తొత్తుగానే, ఆయన తాబేదారుడిగానే ఉన్నానని ఎస్ఈసీ చెప్పదలచుకుంటే ఆయన ఖర్మ. ఇప్పటికైనా ఆయన తన ప్రవర్తను మార్చుకోవాలి. చంద్రబాబు స్క్రిప్టు పట్టుకుని చదివే విధానాన్ని మానుకోవాలి'' అని సూచించారు. 

''ఎన్ని కుట్రలు చేసినా.. పంచాయితీ ఎన్నికల్లో 90 శాతం మంది వైయస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిగారికి ఓటు వేయని వారు కూడా... ఈరోజు ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ఇంటి గడప వద్దకే చేరవేస్తున్న తీరును చూసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. గ్రామాల్లో పెద్దఎత్తున టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీకి ఓట్లు ట్రాన్స్ ఫర్ అవుతుంటే.. చంద్రబాబు, నిమ్మగడ్డ తట్టుకోలేకపోతున్నారు'' అన్నారు.

''ఏకగ్రీవాలపై రాద్ధాంతం చేస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవమైన ఫలితాలను నిలుపుదల చేయడానికి, అక్కడ ఏ ఒక్కరైనా మా నామినేషన్ అడ్డుకున్నారని కంప్లైట్ ఇచ్చారా.. ? నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకూ, ఎవరూ ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వకపోతే, వారంతా సర్పంచ్ లుగా ఎన్నికైనట్టే. వారిని ఆపే అధికారం నిమ్మగడ్డకు గానీ, చంద్రబాబుకుగానీ, మరెవరికీ లేదు'' అని స్పష్టం జోగి రమేష్ చేశారు.