Asianet News TeluguAsianet News Telugu

బట్టలిప్పి నగ్నంగా రోడ్డుపై నిలబెట్టారు... అయినా సిగ్గు లేదు: ఎమ్మెల్యే అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన తెెలుగుదేశం పార్టీ నాయకులపై వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సీరియస్ అయ్యారు. ఇంకా ఈ ప్రాంత నాయకులు చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌కు చెంచాల్లా మిగలాలనుకుంటే అది వారి ఖర్మ అన్నారు. 

YCP MLA Gudiwada Amarnath Fires on TDP  Leaders and Chandrababu
Author
Visakhapatnam, First Published Aug 31, 2021, 3:04 PM IST

విశాఖపట్నం: అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలం ఉత్తరాంధ్రను భక్షించినవాళ్ళే ఈరోజు రక్షిస్తామంటూ చర్చా వేదికలు, బస్సు యాత్రలు చేస్తామంటుంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారని వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ ప్రాంత టీడీపీ నేతల మాట్లాడుతున్న మాటలను చూసి అసహ్యించుకుంటున్నారని అమర్నాథ్ అన్నారు. 

''గతంలో అధికారంలో ఉన్నన్నాళ్ళు విశాఖపట్నాన్ని చంద్రబాబు ఒక గెస్ట్ హౌస్ ప్రాంతంగానే చూశారు తప్పితే ఏనాడూ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కనీసం ప్రయత్నించలేదన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తే.. చంద్రబాబు, టీడీపీ నేతలు ఎందుకు అమరావతి జపం చేస్తున్నారు.  అమరావతి మీద కూడా చంద్రబాబుకు ఉన్నది కమర్షియల్ అటాచ్ మెంటేగానీ ఎమోషన్ అటాచ్ మెంటు కాదు'' అని అమర్నాథ్ మండిపడ్డారు. 

''విశాఖ వేదికగా టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పేరిట ఒక సమావేశం నిర్వహించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్లు మాట్లాడిన విధానం, మాట్లాడిన అంశాలు చూస్తే ఈ ప్రాంత ప్రజలకు ఓ పక్క ఆశ్చర్యం, మరోవైపు అసహ్యాన్ని కలిగించాయి. టీడీపీలో ఉద్ధండులుగా చెప్పుకునేవాళ్లు దద్దమ్మల్లా మాట్లాడటం సిగ్గుచేటు. ఈ ప్రాంతానికి ఏరోజూ మేలు చేయనివాళ్లు, ఇంతకాలం ఉత్తరాంధ్రను  భక్షించినవాళ్లే .. రక్షించాలని మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది'' అన్నారు. 

read more  ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ: హాజరు కాని అచ్చెన్న, కూన రవికుమార్, కమిటీ సీరియస్

''2019 సాధారణ ఎన్నికలు మొదలు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వరకూ  ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీ బట్టలు విప్పి నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సిగ్గు రావడం లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసిందేమీ లేకపోయినా ఆ పార్టీ నాయకులకు మాత్రం చంద్రబాబు మత్తు దిగటం లేదు. అన్ని ఎన్నికల్లో ఆ పార్టీని నగ్నంగా రోడ్డుపై నిలబెట్టినా ఇంకా బుద్ధి రాలేదా అన్నది వారే తేల్చుకోవాలి. ఇంకా చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌కు చెంచాల్లా మిగలాలనుకుంటే అది వారి ఖర్మ'' అని వ్యాఖ్యానించారు. 

''వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి ఉత్తరాంధ్రలోని విశాఖ నుంచి ఇచ్ఛాపురం వరకూ అభివృద్ధికి బీజం వేస్తే దాన్ని ఏరకంగా టీడీపీ అడ్డుకుంటుందో అందరికి తెలిసిందే. ఉత్తరాంధ్ర ప్రాంతానికి జగన్‌ దేశ చిత్రపటంలో ఒక గుర్తింపును తీసుకు వచ్చారు. ఈ ప్రాంతానికి మేలు చేయాలని చూస్తుంటే మరి ఏ హక్కుతో టీడీపీ ఇవాళ ఉత్తరాంధ్ర పరిక్షణ వేదిక పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసింది'' అని ఎమ్మెల్యే అమర్నాథ్ ప్రశ్నించారు. 

''ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం చేసినందుకు మీరు చేయాల్సింది బస్సుయాత్ర కాదు క్షమాపణ యాత్రలు చేయండి. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేశాయంటూ కొన్నివందలు కోట్లు ఖర్చుపెట్టి ఎంవోయూలు అని హడావుడి చేసి ఏం సాధించారు? వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌ స్థాయికి తీసుకు వచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. జగన్‌ పరిపాలనను స్వాగతించకపోయినా ఫరవాలేదు. విమర్శలు చేసి ప్రజలతో ఛీ కొట్టించుకోవద్దని హితవు పలుకుతున్నాం.  చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతూ బంట్రోతులగా పని చేస్తున్న ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు ఇకనైనా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించండి'' అని వైసిపి ఎమ్మెల్యే అమర్నాథ్ సూచించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios