2017: భూకబ్జాల సంవత్సరం

2017: భూకబ్జాల సంవత్సరం

వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు. 2017 సంవత్సరాన్ని ఎంఎల్ఏ భూ కబ్జాల సంవత్సరంగా ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, పేదల భూములు కొట్టేసి ఆస్తులు సంపాదించడమే లక్ష్యంగా చంద్రబాబు, టీడీపీ నాయకులు పనిచేస్తున్నారని మండిపడ్డారు.  ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో బెదిరించి 33 వేల ఎకరాల భూమిని లాక్కుని రైతులను రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు చాలా చోట్ల రికార్డులు తారుమారుచేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

రైతులు, కూలీలను ద్వేషించే చంద్రబాబు హుద్‌హుద్‌ తుఫాను తర్వాత రెవెన్యూ రికార్డులను మాయం చేసి, విశాఖ జిల్లాలో లక్షల ఎకరాలను కాజేశారన్నారు. అంతటి భారీ భూ కుంభకోణంపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగలేదన్నారు. రైతుల భూములు లాక్కోవటంతో లక్షలమంది రైతు కూలీలు, కౌలు రైతుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని చెప్పారు. కోర్టులు మొట్టికాయలు వేసినా టీడీపీ సర్కారు తీరు మారలేదని మండిపడ్డారు. గడిచిన మూడున్నరేళ్లలో వేలమంది రైతుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయే తప్ప రాజధానిలో శాశ్వత నిర్మాణమంటూ ఒక్కటీ జరగలేదని ఎద్దేవా చేసారు. అసలు రాజధానిని కట్టాలన్న ఆలోచనే చంద్రబాబుకు లేదు అని ఆర్కే అన్నారు.

సభలో ప్రతిపక్షం లేకుండా శాసనసభను నడపడం సిగ్గుమాలిన చర్య అని వ్యాఖ్యానించిన ఆర్కే 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేసేందుకు బాబు విఫలయత్నం చేశారని గుర్తుచేశారు. ఇప్పటికైనా రైతుల పొట్టకొట్టే విధానాలకు చంద్రబాబు స్వస్తి పలకాలని హితవుచెప్పారు.

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page