తండ్రి చంద్రబాబు దోచుకుంటుంటే, కొడుకు లోకేష్ దాచుకుంటున్నాడు : కోలగడ్ల

ycp leaders fire on ap cm chandrababu
Highlights

చంద్రబాబును పెట్టి మహానటుడు సినిమా తీయొచ్చన్న తమ్మినేని

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకుంటుంటే, ఆయన కొడుకు ఐటీ మంత్రి లోకేష్ ఆ డబ్బులు దాచుకుంటున్నారని వైసిపి నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. వీరి హయాంలో రాష్ట్రంలో నీకు దొరికినంత దోచుకో- దాచుకో అనే పథకం కొనసాగుతోందని ఆయన దుయ్యబట్టారు. ఇవాళ నెల్లూరులో జరిగిన వంచన దీక్షలో పలువురు జిల్లా నాయకులు పాల్గొని చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇలా దోచుకున్కన డబ్బులతోనే రెండెకరాల నుండి రెండు లక్షల కోట్లకు పడగలెత్తారని వైసిపి నాయకులు విమర్శించారు.

ఈ  దీక్షా సభలో వైసిపి అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ...నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు మరో నాటకం మొదలు పెట్టారని అన్నారు. ఆయనతో మహానటుడు అనే సినిమా తీయాల్సి వస్తుందేమోనని అన్నారు. నాలుగేళ్లుగా బిజెపితో భుజం భుజం రాసుకుంటూ తిరిగి ఇపుడు ఎన్నికలు దగ్గరికి వచ్చే సరికి ప్రత్యేక హోదా గుర్తుకు వచ్చిందా అని చంద్రబాబు ను ఆయన ప్రశ్నించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన మరో నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ...ప్రజాస్వామ్య మంటే చంద్రబాబు కు లెక్కే లేదని అన్నారు. మొన్నటి వరకు మోదీ పంచన ఉండి భజన చేసిన చంద్రబాబు ఇపుడు రాహుల్ పంచన చేరాడని విమర్శించారు. పార్టీ పిరాయింపులు, ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని నల్లపురెడ్డి ఆరోపించారు.  

loader