విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసిపీలో మరోసారి వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రారావు వర్గీయులు భాహీబాహీకి దిగారు. వంశీ వర్గీయులు తమపై దాడి చేసారంటూ దుట్టా వర్గం మరోసారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

రామవరప్పాడుకు చెందిన పిఏసీఎస్ అధ్యక్షుడు నబిగాని కొండ ఇంటిపై అర్ధరాత్రి కొంత మంది రాళ్ళ దాడి చేశారంటూ పడమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదయ్యింది. ఈ క్రమంలోనే నబిగాని కొండ మాట్లాడుతూ... గత పదేళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు. దుట్టా, యార్లగడ్డ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు కష్ట పడి పనిచేశామని తెలిపారు.

వీడియో

 అయితే ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోకుండా పార్టీలో పెత్తనం చేలాయిస్తూ... 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన వారిని వంశీ వర్గీయులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనివ్వకుండా చేస్తున్నారని అన్నారు. వంశీ వర్గం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కు అడ్డుపడ్డామనే కక్షతో గత రాత్రి కొంత మంది తన ఇంటి పై దాడి చేసి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేసారని తెలిపారు.  అర్ధరాత్రి సమయంలో చేసిన దాడిపై పడమట పోలీసులకు, పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు తాను, తన భర్త కష్టపడి పనిచేశామని... అలాంటిది అర్ధరాత్రి తమ ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కొండ భార్య కోరారు. తన భర్తకు రక్షణ కల్పించాలని కన్నీటి పర్యంతమయ్యారు.