అనంతపురం సెబ్ పోలీస్ స్టేషన్ పై వైసీపీ నాయకులు, కార్పొరేటర్లదాడి చేశారు. మహిళా కానిస్టేబుల్ తో అనుచితంగా ప్రవర్తించారు. ఆమె డ్రెస్ లాగి దాడి చేశారు. 

అనంతపురం : అనంతపురంలోని సెబ్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హల్ చల్ సృష్టించారు. ఓ మహిళా కానిస్టేబుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆమె డ్రెస్ లాగారు. సిఐ సీట్లో కూర్చోబోతే వారించగా ఇష్టారీతినదాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ తాను ఎక్కడైనా కూర్చోవచ్చు అంటూ వాగ్వాదానికి దిగారు. బుధవారం రాత్రి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనుచరులు సెబ్ పోలీస్ స్టేషన్ పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే…

సెబ్ పోలీసులు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతని మీద కేసు నమోదు చేయొద్దని ఎమ్మెల్యే అనుచరులు సెబ్ పోలీసులపై దాడికి దిగారు. అదుపులోకి తీసుకున్న చేసిన వ్యక్తి పేరు గుజ్జల సురేష్. అతను అనంతపురం నగరంలోని నవోదయ కాలనీ నివాసి. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడు. దీనికి సంబంధించి పక్కా సమాచారం అందడంతో సెబ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీలో పొగలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు

గుజ్జల సురేష్ నుంచి 96 మద్యం బాటిల్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఏపీకి చెందిన మద్యమే. అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలియడంతో నగరంలోని 32వ డివిజన్ కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్, మరో కార్పోరేటర్ కమల్ భూషణ్ తమ అనుచరులు పాతిక మందితో కలిసి గుల్జార్ పేటలోని సెబ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు.

వస్తూనే హల్చల్ సృష్టించారు. తాము కార్పొరేటర్ లమని.. ఎమ్మెల్యే మనుషులమని చెప్పుకొచ్చారు. అక్రమ మద్యం కేసులో అదుపులోకి తీసుకున్న గుజ్జల సురేష్ పై కేసు నమోదు చేయొద్దని పట్టుపట్టారు. అయితే అక్కడ సిబ్బంది ఆ విషయం పోలీసు అధికారులతో మాట్లాడాలని తెలిపారు. ఈ క్రమంలో ఓ కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్ ఎస్ఐ కుర్చీలో కూర్చోబోయాడు. 

దీనికి పోలీసులు అభ్యంతరం తెలిపారు. అది ఎస్ఐ సీటు అని కూర్చోవద్దని అన్నారు. దీంతో ‘పోలీస్ స్టేషన్ పబ్లిక్ ప్రాపర్టీ.. ఎక్కడైనా కూర్చోవచ్చు’.. అని చంద్రశేఖర్ పోలీసులతో వాదనకు దిగాడు. పోలీస్ స్టేషన్లో హడావుడి సంగతి తెలిసి కార్పొరేటర్లకు చెందిన మరింత మంది అనుచరులు అక్కడికి వచ్చారు. తమ బలం పెరగడంతో వైసిపి నాయకులు రెచ్చిపోయారు.

స్టేషన్లో అప్పుడు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాధా చంద్రశేఖర్ వాగ్వాదానికి దిగడంతో.. ఎందుకు అరుస్తున్నావ్? అని ప్రశ్నించింది. ఆ సమయంలో ఎస్సై మునిస్వామిపై వైసీపీ వర్గీయులు చేయి చేసుకున్నారు. అతనిని కిందికి తోసేశారు. మహిళా కానిస్టేబుల్ రాధా వైసిపి వర్గీయులను పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీరితో పాటు వచ్చిన గుజ్జల సురేష్ తండ్రి మహిళా కానిస్టేబుల్ డ్రెస్ లాగాడు. తల మీద దాడి చేశాడు.

ఆమె వారిని పట్టుకుని స్టేషన్లోకి లాక్కెళ్ళేందుకు ప్రయత్నించగా.. వారు తిరగబడి ఆమెను కూడా స్టేషన్ నుంచి బయటికి లాగేశారు.హెడ్ కానిస్టేబుల్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆయన మీద దాడి చేశారు. దాంతోపాటు ‘ఎలా డ్యూటీ చేస్తారో చూస్తాం బయటికి రాకుండా ఉంటావా’ అని బెదిరించారని రాధా ఆవేదన వ్యక్తం చేసింది.

ఇలా ఉండగా వైసిపి అనుచరులు మాత్రం తమదే కరెక్ట్ అనే విధంగా ప్రవర్తించారు. వీరితో పాటు వచ్చిన ఓ మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం గమనార్హం. వైసీపీ నాయకుల అనుచరులతో పాటు వార్డు వాలంటీర్లు కూడా వీరిలో ఉన్నారు. అయితే ఇంత గలాటా మధ్యలో కూడా స్టేషన్ కి వచ్చిన వారు నిందితుడు సురేష్ బంధువులు అని మాత్రమే చెప్పడం కొసమెరుపు.