సత్తెనపల్లిలో అంబటికి పోటీ: అనుచరులతో నేడు విజయ భాస్కర్ రెడ్డి విందు రాజకీయం
సత్తెనపల్లిలో వైసీపీ టిక్కెట్టు కోసం విజయభాస్కర్ రెడ్డి ప్రయత్నాలను ప్రారంభించారు.. ఇవాళ ఆయన పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంపై మంత్రి అంబటి రాంబాబు లైట్ గా తీసుకున్నారు.
గుంటూరు:సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో వైరి వర్గం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనుంది.2024 ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ టిక్కెట్టును రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని విజయభాస్కర్ రెడ్డి వర్గం డిమాండ్ చేస్తుంది. ఇదే డిమాండ్ తో ఇవాళ విజయభాస్కర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళం నిర్వహించనున్నారు. మరో వైపు ఇలాంటి సమావేశాలు ఎన్నికల సమయంలో సర్వసాధారణమని మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుండి అంబటి రాంబాబు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించాడు. అయితే ఈ దఫా మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి ఈ స్థానంలో టిక్కెట్టు కోసం వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్ ను పార్టీ అధిష్టానం ముందుంచనున్నారు.
సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టిక్కెట్టు కోసం విజయభాస్కర్ రెడ్డి కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని విజయభాస్కర్ రెడ్డికి పార్టీ నాయకత్వం టిక్కెట్టును కేటాయిస్తుందా అనే చర్చ కూడా లేకపోలేదు.
టిక్కెట్ల కేటాయింపులో జగన్ దే తుది నిర్ణయం. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ప్రజా ప్రతినిధుల తీరుపై ఎప్పటికప్పుడు సీఎం జగన్ నివేదికలను తెప్పించుకుంటున్నారు. విజయం సాధించే అవకాశం లేని అభ్యర్ధులకు టిక్కెట్లు కేటాయించవద్దని జగన్ భావిస్తున్నారు. గెటుపు గుర్రాలనే ఈ దఫా అసెంబ్లీ బరిలో దింపనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపే స్థానిక అంశాలు, సామాజిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. ఏపీ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నాయి. కీలకమైన కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాంబాబును పక్కన పెట్టి రెడ్డి సామాజిక వర్గానికి ఈ నియోజకవర్గంలో సీటు కేటాయిస్తారా అనే చర్చ కూడా లేకపోలేదు. అయితే పల్నాడు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు కూడా గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ అంశాన్ని విజయభాస్కర్ రెడ్డి వర్గీయులు ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఈ విషయమై వైసీపీ నాయకత్వం ఎలా వ్యవహరిస్తుందోననేది ప్రస్తుతం అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
మరో వైపు ఇవాళ విజయభాస్కర్ రెడ్డి నిర్వహించే సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతమంది పార్టీ నేతలు హాజరౌతారనే విషయమై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ కూడా లేకెపోలేదు.ఇవాళ జరిగే సమావేశంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎన్నికల సమయంలో ఇలాంటివి సర్వసాధారణమేనన్నారు.