ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నుంచి అభ్యర్ధులుగా ఖరారైన మోపిదేవి వెంకటరమణ, ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలు బుధవారం అమరావతిలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి నానినేషన్ పత్రాలు సమర్పించారు.

అనంతరం ఇక్బాల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే వ్యక్తి ఒక్క జగన్ మాత్రమేనని కొనియాడారు.

పదే పదే అడిగించుకోవడం జగన్ నైజం కాదని.. రంజాన్ రోజు చెప్పారు, బక్రీద్ రోజున పదవి ఇచ్చేశారని ఇక్బాల్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనమండలి స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 3,  తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్ వెలువరించింది.

ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని , కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇందుకు సంబంధించి ఆగస్టు 7న నోటిఫికేషన్ వెలువడనుండగా.. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 14 వరకు గడువు విధించారు. ఈ నెల 16న నామినేషన్ల పరిశీలిన, ఆగస్టు 19న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఆగస్టు 26న పోలింగ్ జరిపి.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు:

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: వైసీపీ అభ్యర్ధులు వీరే

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు