బీసీలకు ఏమీ చేయలేదని అంతరాత్మ చెప్పడంతోనే జయహో బీసీ సభలో వరాల జల్లు కురిపించారని ఆరోపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘‘జయహో బీసీ’’ సభపై నిప్పులు చెరిగారు.

4 సంవత్సరాల 2 నెలల పాటు బీజేపీతో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ సామాజిక వర్గం వారు కేంద్రమంత్రులుగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా వెళ్లిన వారిలో ఎవ్వరూ బీసీ నేతలు లేరని ధర్మాన ఎద్దేశా చేశారు.

బీసీలంటే చంద్రబాబు అసహ్యమని జస్టిస్ ఈశ్వరయ్య ఆధారాలతో సహా చూపించారని ఆయన మండిపడ్డారు. మత్స్యకారులను ఎస్టీలో కలుపుతామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆ వర్గం నిరసన దీక్షను చేపట్టారని, వారి అంతుచూస్తానని చంద్రబాబు బెదిరించలేదా అని ప్రసాదరావు ప్రశ్నించారు.