ఆమంచి కృష్ణమోహన్  టీడీపీ ని వీడి.. వైసీపీలో చేరడం ఆ పార్టీ నేతలు కొందరికి మింగుడు పడటం లేదు. ఇలా ఆమంచి పార్టీలో చేరి కొద్ది రోజులు కూడా గడవలేదు. అప్పుడే.. పార్టీలో బేధాభిప్రాయాలు మొదలయ్యాయి. చీరాల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త యడం బాలాజీ టీడీపీలో చేరో యోచనలో ఉన్నారు. ఈ మేరకు తన మద్దతు దారులతో మంతనాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి సమన్వయకర్తగా పని చేస్తున్న యడం బాలాజీ పార్టీ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే ఆమంచితో వైసీపీ నాయకులు మంతనాలు జరుపుతున్నారని తెలిసిన తర్వాత నుంచే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఎమ్మెల్యే ఆమంచిని పార్టీలో చేర్చుకునే విషయాన్ని ముందుగా తెలిజేయకపోవడంపై బాలాజీ ఆనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ మేరకు శనివారం హైదరాబాదులో జగన్‌ను కలిసిన బాలాజీ ఆయన ఎదుట తన అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. ఆమంచి పార్టీలో చేరడాన్ని తాను స్వాగతించనని బాలాజీ తేల్చి చెప్పినట్లు సమాచారం. జగన్ తో చర్చల ఫలితం ఎలా ఉన్నా.. బాలాజీ మాత్రం పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయంలో అధికారిక ప్రకటన రానుంది.