వైసిపి అధికారప్రతినిధి అంబటి రాంబాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అబివృద్ధి కార్యక్రమాలపై టిడిపి ఎంఎల్సీ బుద్దా వెంకన్నతో సోమవారం జరగాల్సిన ‘చర్చా కార్యక్రమం’ జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతకీ ఏమి జరిగిందంటే, సత్తెనపల్లిలో మూడున్నరేళ్ళ అభివృద్ధిపై కొద్ది రోజులుగా వైసిపి-టిడిపి నేతలు సవాళ్ళు ప్రతిసవాళ్ళు చేసుకుంటున్నారు.

ఇరుపార్టీల నేతల మధ్య మొదలైన సవాళ్ళతో సత్తెనపల్లిలో రాజకీయ వాతావరణం హీటెక్కిందనే చెప్పాలి. సత్తెనపల్లి స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నియోజకవర్గమన్న సంగతి అందరికీ తెలిసిందే. మొత్తానికి అభివృద్ధిపై చర్చించేందుకు వైసిపి తరపున అంబటి రాంబాబు, టిడిపి తరపున బుద్ధా వెంకన్న సిద్ధపడ్డారు. సోమవారం ఉదయం సత్తెనపల్లిలోనే చర్చ జరిగేట్లు నిర్ణయం కూడా జరిగింది. అందుకే వెంకన్న విజయవాడ నుండి సత్తెనపల్లికి బయలుదేరారు. అంబటి కూడా వేదిక వద్దకు బయలుదేరారు. అయితే, ఇంట్లో నుండి బయటకు రాగానే అంబటిని పోలీసులు అరెస్టు చేశారు. అంబటి ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.

ఎప్పుడైతే అంబటిని పోలీసులు అరెస్టు చేశారో వైసిపి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అంబటి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఒకరిని అరెస్టు చేస్తే బాగుండదని అనుకున్న పోలీసులు చుట్టుగుంట వద్ద  వెంకన్నను కూడా  అడ్డుకున్నారు. సత్తెనపల్లికి అనుమతించేది లేదంటూ వెంకన్న ప్రయాణిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఇరువైపుల నుండి ఘర్ణణ వాతావరణం నెలకొంది. గతంలో కూడా పోలవరంపై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, టిడిపి ఎంఎల్ఏ బుచ్చయ్య చౌదరి మధ్య కూడా సవాళ్ళు-ప్రతి సవాళ్ళు జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు కూడా పోలీసులు ఉండవల్లిని ప్రకాశం బ్యారేజి వద్ద అరెస్టు చేసి తర్వాత వదిలిపెట్టారు.