గుంటూరు: దళిత ఎంపి దుర్గాప్రసాద్ సంతాప తీర్మానంపై పార్లమెంటులో చర్చను వైసిపి బాయ్ కాట్ చేయడం నీచమని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తన పార్టీకే చెందిన దళిత ఎంపీ మృతిచెందితే కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా సీఎం జగన్ ఇంట్లో నుంచి బైటకు రాలేదని మండిపడ్డారు. 

చంద్రబాబు అధ్యక్షతన టిడిపి లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళితులపై దాడులను ఖండించడానికి జగన్ కు నోరు రాదు... కనీసం సానుభూతి చెప్పడానికి కూడా మనసు లేదా అని నిలదీశారు. మీ సభ్యుడిపై కూడా మీకు కనికరం లేకపోవడం కన్నా కిరాతకం మరొకటి లేదని అన్నారు. 

''ఇక జిఎస్టి నిధుల కోసం ప్రతిపక్షాల ధర్నాలో వైసిపి ఎంపిలు పాల్గొనకపోవడం గర్హనీయం. టిడిపిపై కక్ష సాధింపుపై ఉన్న శ్రద్ద జిఎస్టి నిధులు రాష్ట్రానికి రాబట్టడంపై వైసిపికి లేదు'' అని ఆరోపించారు. 

read more  రోజాకి ఆ బిల్డింగ్ పై నుండి దూకే ధైర్యం ఉందా?: అనురాధ సవాల్

''కండిషన్ బెయిల్ పై ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థపై విమర్శలు చేయడం దివాలాకోరుతనం. తప్పులు చేసింది వైసిపి అయితే నిందలు వేస్తోంది కోర్టులపై, దుష్ప్రచారం చేస్తోంది ప్రతిపక్షాలపై. కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని అభివృద్ది కోసం 372 మంది ఆలిండియా సర్వీస్ అధికారులకు ఇళ్లస్థలాలు ఇచ్చారు. జ్యుడిసియల్ సర్వీసెస్ అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, మీడియా ప్రతినిధులకు ఇళ్లస్థలాలు ఇచ్చారు. ప్రస్తుత సీఎంవోలో ఉన్నతాధికారులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అలాంటిది  జడ్జిలకు ఇచ్చిన ఇళ్లస్థలాలపై వైసిపి దుష్ప్రచారం చేయడం హేయం'' అని అన్నారు. 

''16నెలల వైసిపి పాలనలో అవినీతి కుంభకోణాలు అన్నింటిపై సిబిఐ దర్యాప్తును కోరాలి. ఇళ్లస్థలాలకు భూసేకరణలో రూ4వేల కోట్ల స్కామ్ లపై సిబిఐ విచారణ జరపాలి. మద్యం నాసిరకం బ్రాండ్లు, జె ట్యాక్స్ వసూళ్లపై సిబిఐ దర్యాప్తు చేయాలి. ఇసుక, లేటరైట్, గ్రానైట్ మైనింగ్ మాఫియా స్కామ్ లపై సిబిఐ విచారణ కోరాలి.అంతర్వేదితో సహా ఆలయాలు అన్నింటిపై దురాగతాలపై సిబిఐ దర్యాప్తు చేయాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.