Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఆర్థిక నగరాల నిర్మాణం..: మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌2021లో జగన్ ప్రకటన

ఇప్పుడు నిర్వహిస్తున్న ‘భారత సముద్రయాన సదస్సు’ (మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌) ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

ycp government plans new economy cities construction...cm jagan announcement
Author
Amaravathi, First Published Mar 2, 2021, 4:10 PM IST

అమరావతి: మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌ –2021ను  ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... ప్రపంచ సముద్రయాన (మారిటైమ్‌) రంగంలో భారత్‌ ఒక విశిష్ట గుర్తింపును సాధిస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. పారిశ్రామిక పురోగతి, పోర్టు ఎకానమీ(నౌకాశ్రయాల ద్వారా ఆర్థిక ప్రగతి)కి భారత్, ముఖ్యంగా రేవులు కలిగిన రాష్ట్రాలు ముఖ్యభూమిక పోషించాయిన్నాయి. ఈ సుదీర్ఘ పయనంలో ఇప్పుడు నిర్వహిస్తున్న ‘భారత సముద్రయాన సదస్సు’ (మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌) ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నాననని జగన్ అన్నారు. 

ycp government plans new economy cities construction...cm jagan announcement
 
''దేశ వాణిజ్య రంగంలో 95 శాతం, ఆ వాణిజ్య విలువలో 70 శాతం వరకు సముద్ర యానం ద్వారానే జరుగుతోంది. గత ఏడాది (2019–20)లో దేశంలోని నౌకాశ్రయాల ద్వారా 1.2 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్గో రవాణా జరిగింది. 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), మేక్‌ ఇన్‌ ఇండియా, సాగర్‌ మాల, భారత్‌ మాల వంటి సంస్కరణల ప్రక్రియ ఈ రంగంలో విశేష పురోగతికి ఎంతో దోహదం చేశాయి. ఆ దిశలో రూపొందించిన మారిటైమ్‌ ఇండియా విజన్‌ 2030 డాక్యుమెంట్‌ ఈ రంగంలో ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకిత భావానికి ఒక నిదర్శనంలా నిలుస్తుంది'' అన్నారు. 

''దేశ ఆర్థిక పురోగతిలో బ్లూ ఎకానమీ (మత్స్య సంపద, సముద్ర ఉత్పత్తులు ద్వారా వచ్చే ఆర్థిక ప్రగతి) అన్నది సముద్ర యానం ద్వారా జరిగే వాణిజ్య కార్యకలాపాలు, ఎగుమతులు, దిగుమతుల గణాంకాల ఆధారంగానే కాకుండా, ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన అనుబంధ విభాగాలు.. ఆక్వా కల్చర్, సముద్ర యానం (మారిటైమ్‌), సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటక రంగం, రసాయన మరియు జీవ సాంకేతిక పరిశోధన, నౌకల నిర్మాణం (షిప్‌ బిల్డింగ్‌), నౌకాశ్రయాలపై ఆధారపడిన పరిశ్రమల వంటి వాటిపై కూడా ఆధారపడి ఉంటుంది. అవన్నీ కలిసికట్టుగా పని చేస్తే, ఈ రంగంలో దేశం కాంక్షిస్తున్న పురోగతితో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరుస్తాయి, గత ఏడాది సెప్టెంబరులో ప్రభుత్వం విడుదల చేసిన మొట్టమొదటి జాతీయ మత్స్య విధాన ముసాయిదా, ఆ దిశలో ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలకు ఉదాహరణగా కనిపిస్తుంది'' అని పేర్కొన్నారు. 

''సముద్ర యానం ద్వారా ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చి, అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలన్న స్ఫూర్తిదాయక ఎజెండాను ఆదర్శంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో పలు చర్యలు తీసుకుంది. రాష్ట్రానికి సువిశాలమైన 974 కి.మీ తీర ప్రాంతం ఉంది. ఇది దేశంలోనే రెండో పెద్ద తీర ప్రాంతం కాగా, భారత తూర్పు తీరంలో అత్యంత పొడవైన తీర ప్రాంతం'' అని వివరించారు.

''కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తాజాగా విడుదల చేసిన 2020 ఏడాది ర్యాంకింగ్స్‌ ప్రకారం, ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ (సులభతర వ్యాపారం)లో ఈరోజు రాష్ట్రం తొలి స్థానంలో నిల్చిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. నౌకాశ్రయాలలో మౌలిక వసతుల కల్పన, వాటిపై ఆధారపడిన పరిశ్రమలకు నిరంతర ప్రోత్సాహం వంటి చర్యల ద్వారానే ఇది సాధ్యమైంది'' అని తెలిపారు.

ycp government plans new economy cities construction...cm jagan announcement

''ఆంధ్రప్రదేశ్‌లో విశాఖలో అతి పెద్ద నౌకాశ్రయంతో పాటు, అయిదు చోట్ల నౌకాశ్రయాలు, మరో పది గుర్తించిన ఓడరేవులు ఉన్నాయి. వాటన్నింటిలో ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పించడం ద్వారా ఏటా 170 మిలియన్‌ టన్నులకు పైగా సరుకుల (కార్గో) రవాణా జరుగుతోంది. కార్గో రవాణాలో గుజరాత్‌ అగ్ర స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిల్చింది. మొత్తం దేశీయ దిగుమతుల్లో రాష్ట్ర నౌకాశ్రయాలు, ఓడరేవుల ద్వారా 4 శాతం వరకు కొనసాగుతుండగా, 2030 నాటికి కనీసం 10 శాతం దిగుమతులు రాష్ట్రం గుండా జరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది'' అని వెల్లడించారు.

''నౌకాశ్రయాలపై ఆధారపడి, అవే ప్రధాన కేంద్రాలుగా ఇటీవల రాష్ట్రానికి పలు పరిశ్రమలు వచ్చాయి. ఈ రంగంలో ఉన్న మరిన్ని అవకాశాలను అంది పుచ్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు చోట్ల.. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు వద్ద పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించకుండా, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఉండే హరిత క్షేత్ర ఓడరేవుల (గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్ట్స్‌)ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా ఈ పోర్టుల నిర్వహణ అత్యంత సులువు కానుంది. ప్రైవేటు రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవి సజావుగా పని చేసే విధంగా వాటి నిర్మాణం జరుగుతోంది. ఆ ఓడరేవుల నిర్మాణాలు పూర్తైన తర్వాత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చే విధంగా, పోటీ పద్ధతిలో (కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌) వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది'' అని ప్రకటించారు.

''సరుకుల రవాణాకు పూర్తి అనుకూలంగా ఉండే (వాతావరణపరంగానూ, పెద్ద ఓడలు వచ్చే విధంగా లోతుగానూ) ఈ ఓడరేవులు 2023 నాటికి సిద్ధమవుతాయి. తద్వారా స్వల్ప కాలంలోనే ఏటా అదనంగా మరో 100 మిలియన్‌ టన్నుల సరుకుల రవాణా (కార్గో) సాధ్యమవుతుంది. ఆ తర్వాత దీర్ఘకాలంలో అది మరింత పెరిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి'' అన్నారు.

''రాష్ట్రంలోని నౌకాశ్రయాలు, ఓడరేవులన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేసే విధంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. సరుకుల రవాణాకు ఓడరేవులపైనే ఎక్కువగా ఆధారపడే తయారీ రంగం, పెట్రో కెమికల్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్‌ రంగాలలో పెట్టుబడులను విశేషంగా ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ రంగంలో నైపుణ్యాలను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు, 8 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తోంది. ఇంకా టెస్టింగ్‌ ల్యాబ్‌లు, శీతల గిడ్డంగులు (కోల్డ్‌ ఛైన్‌ ఫెసిలిటీ) కూడా ఏర్పాటు చేస్తోంది. వీటన్నింటితో ఆయా పోర్టుల ద్వారా కార్గో రవాణాలో ఆక్వా, దాని అనుబంధ రంగాల వాటా మరింత పెరగనుంది'' అన్నారు. 

''ఆ విధమైన నిర్దిష్ట చర్యలు, ప్రక్రియల ద్వారా ఓడరేవులు, నౌకాశ్రయాలపై ఆధారపడిన పరిశ్రమలను ప్రోత్సహించడం, తద్వారా ఆర్థిక పురోగతి సాధించడంతో పాటు, సువిశాల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో నూతన ఆర్థిక నగరాల నిర్మాణం జరిగేలా ప్రభుత్వం పని చేస్తోంది'' అని ప్రకటించారు. 

''చివరగా, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఈ సదస్సుకు హాజరైన దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులందరినీ నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా పూర్తి సహాయ, సహకారాలు అందజేస్తుందని నేను హామీ ఇస్తున్నాను. అంతే కాకుండా మీ పరిశ్రమల నిర్వహణకు ఇక్కడ పూర్తి అనువైన వాతావరణం, పరిస్థితులు ఉంటాయని, మీ ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను'' అంటూ సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలెవన్‌, పశుసంవర్ధక, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్‌ కె రామ్మోహన్ రావు, పోర్ట్స్ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios