ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను వైసిపి చక్కగా ఆచరణలో పెడుతోంది. సరికొత్త వ్యూహాన్ని అమలు చేయటం ద్వారా చంద్రబాబునాయుడు, లోకేష్ ను జాతీయ స్ధాయిలో బద్నాం చేయటం మొదలుపెట్టింది. ఇంతకాలం తమపై ఏ విధమైన ముద్ర వేసి ప్రచారం చేసిందో అదే పద్దతిని వైసిపి కూడా అనుసరిస్తోంది.

ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో వెంటనే తమ వ్యూహాన్ని అమల్లోకి తెచ్చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే, చంద్రబాబు, లోకేష్ ను ఆర్ధిక ఉగ్రవాదులుగా ముద్రవేయటం. కొద్ది సంవత్సరాలుగా జగన్ పై టిడిపి అదే పని చేసిన సంగతి అందిరికీ తెలిసిందే. తనకు మద్దతుగా నిలిచే మీడియాతో జగన్ కు వ్యతిరేకంగా విపరీతమైన ప్రచారం చేయించింది. సొంతంగా కథనాలను వండి వర్చేట్లు చేసింది.

ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేయగానే ఢిల్లీలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒకేసారి తండ్రి, కొడుకులపై ఆరోపణలు మొదలుపెట్టారు. జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్య్వూల్లో కూడా చంద్రబాబు, లోకేష్ అవినీతినే ప్రధానంగా ప్రస్తావించటం గమనార్హం. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఆర్ధిక, సామాజిక, రాజకీయ నేరగాళ్ళుగా ముద్రవేయటం మొదలుపెట్టారు.

మొత్తం పార్టీ నేతలంతా అదే పద్దతిలో ఆరోపణలు మొదలుపెట్టారు. జాతీయ స్ధాయిలో అదే ప్రచారం జోరు పెంచారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేటపుడు విజయసాయి ప్రత్యేకించి చంద్రబాబు, లోకేష్ అవినీతిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్ధాయిలో తండ్రి, కొడుకుల అవినీతి అంటే ప్రత్యేక కథనాలు వచ్చేట్లు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.