మచిలీపట్నం మేయర్ ఎన్నిక సందర్భంగా జనసేన కార్యాలయానికి వైసిపి ప్లెక్సీలు ఏర్పాటుచేయడం వివాదాస్పదంగా మారింది. 

మచిలీపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ప్లెక్సీల వివాదం కొనసాగుతోంది. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికార వైసిపి, ప్రతిపక్ష జనసేన పార్టీ ల మధ్య ప్లెక్సీ వివాదం రేగింది. మేయర్ ఎన్నిక సందర్భంగా జనసేన కార్యాలయానికి వైసిపి ప్లెక్సీలు ఏర్పాటుచేయడం వివాదానికి దారితీసింది. జనసేన నాయకులు ప్లెక్సీని తొలగించడంతో వైసిపి నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. 

నిన్న (సోమవారం) మచిలీపట్నం మేయర్ గా చిటికిన వెంకటేశ్వరమ్మ ఎన్నికయ్యారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజబాబు నూతన మేయర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు వైసిపి నాయకులు, కార్యకర్తలు మచిలీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ప్రధాన రోడ్లలో నూతన మేయర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్లెక్సీలు వెలిసాయి. ఇలా జనసేన నాయకుడు కొరియర్ శ్రీను కార్యాలయానికి కూడా వైసిపి ప్లెక్సీలు ఏర్పాటుచేయడం వివాదంగా మారింది. 

వీడియో

స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు యూత్ పేరుతో జనసేన కార్యాలయానికి ప్లెక్సీలు ఏర్పాటుచేసారు. అయితే వైసిపి ర్యాలీ జరిగే సమయంలోనే ప్లెక్సీలను వుంచుతామని... ఆ తర్వాత తొలగిస్తామని ముందుగానే జనసేన నాయకుడు శ్రీను అనుమతి తీసుకున్నట్లు వైసిపి నాయకులు చెబుతున్నారు. కానీ ర్యాలీ ముగిసిన తర్వాత కూడా ప్లెక్సీ తొలగించకపోవడంతో భారీగా జనసేన నాయకులు శ్రీను కార్యాలయం వద్దకు చేరుకుని తొలగించారు. ఈ విషయం తెలిసి వైసిపి నాయకులు, మేయర్ వర్గీయులు జనసేన కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

Read More ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్.. వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు..

వైసిపి, జనసేన నాయకుల మధ్య ప్లెక్సీ విషయంలో వాగ్వాదం, తోపులాట జరిగింది. నాయకుల మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. వైసిపి, జనసేన వర్గాలను చెదరగొట్టి జనసేన కార్యాలయం వద్ద పికెట్ ఏర్పాటు చేసారు.