పాపం...గీత

First Published 17, Nov 2017, 3:07 PM IST
YCP defector MP Geetha insulted by telugu desam government
Highlights
  • అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీతను చూస్తే పాపం అని పిస్తుంది.

అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీతను చూస్తే పాపం అని పిస్తుంది. ఎందుకంటే, నమ్మి ఆధరించిన పార్టీని ఆమె వెన్నుపోటు పొడిచినట్లుగానే తాను నమ్ముకున్న పార్టీ ఆమెను తరిమేసింది. దాంతో ఇపుడు గీత ఏ పార్టీకీ కాకుండా పోయారు. దాంతో ఆమె రాజకీయ భవిష్యత్తే గందరగోళంగా తయారైంది. ఇంతకీ విషయమేంటంటే, ప్రభుత్వ అధికారిణిగా ఉన్న కొత్తపల్లి గీత విభజనానంతరం ఉద్యోగానికి రాజీనామా చేసారు. రాజకీయాల్లో ఆశక్తితో  వైసీపీలో చేరారు. గిరిజన మహిళ, ప్రభుత్వ అధికారిణి, అందులోనూ ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి కావటంతో జగన్ కూడా వెంటనే గీతను పార్టీలోకి చేర్చుకుని బాగా ప్రోత్సహించారు.

సీన్ కట్ చేస్తే 2014 ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలోని అరకు పార్లమెంటు స్ధానానికి పోటీ చేసి పెద్ద మెజారిటీతోనే గెలిచారు. అయితే, ఏమైందో ఏమో గెలిచిన కొద్ది కాలానికే వైసీపీకి దూరమయ్యారు. ఓ మంచి ముహూర్తం చూసుకుని టిడిపిలో చేరిపోయారు. దాంతో అప్పటి నుండి కొత్తపల్లి టిడిపి ఎంపిగానే కొనసాగుతున్నారు. మళ్ళీ అక్కడ కూడా ఏమైందో ఏమో? టిడిపి నాయకత్వంతోనూ విభేదాలొచ్చాయి.

అటువంటి సమయంలోనే హైదరాబాద్ శివారు ప్రాంతంలో సుమారు రూ. 500 కోట్ల విలువైన భూకబ్జా కేసులో ఇరుక్కున్నారు. కేసులో నుండి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు ఆ కేసులో భర్త జైలుకు కూడా వెళ్ళారు. అవసరానికి సాయం చేయలేదన్న అక్కసుతో చంద్రబాబునాయుడుపై విమర్శలు, ఆరోపణలు గుప్పించటం మొదలుపెట్టారు. దాంతో టిడిపి నేతలు కూడా గీతను పూర్తిగా దూరం పట్టేసారు.

దాంతో గీత పరిస్ధితి ఎలా తయారైందంటే అరకు పార్లమెంటు స్ధానం పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు కనీసం ఆహ్వానం కూడా అందటం లేదు. మొన్ననే జరిగిన అంతర్జాతీయ బెలూన్ల ఫెస్టివల్ కు కూడా ఆహ్వానం లేదు. ఈ విషయాన్ని ఎంపినే చెప్పారు. అంటే ప్రభుత్వం గీతను పూర్తిగా పక్కన పెట్టేసిందన్న విషయం అర్దమైపోతోంది. ఇపుడంటే ఎంపి కాబట్టి ఏదోలా నెట్టుకొచ్చేస్తుంది. 2019 ఎన్నికల తర్వాత పరిస్ధితే...అర్ధం కావంట లేదు.

loader