వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన ఓ లేఖ ఎన్ఫోర్స్ మెంట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇడిలోని ఇద్దరు అధికారులు చంద్రబాబునాయుడు ఆడమన్నట్లు ఆడుతున్నారంటూ జగన్ ప్రధానమంత్రికి ఫిబ్రవరి నెలలో ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదుపై విచారణ చేయమని ప్రధాని కార్యాలయం ఇడి హెడ్ క్వార్టర్స్ లోని ఉన్నతాధికారులకు పంపిన ఆదేశాలే ఇపుడు కలకలం సృష్టిస్తోంది. అవసరమున్నా లేకపోయినా ఇడిలోని ఇద్దరు అధికారులు తమ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు పదేపదే ప్రకటిస్తున్నారంటూ జగన్ తన లేఖలో ఫిర్యాదు చేసారు.

తమ ఆస్తులను అటాచ్ చేయవద్దంటూ కోర్టు చెప్పినా వినకుండా అటాచ్ మెంట్ విషయాన్ని పదేపదే ప్రకటించటమే కాకుండా తన భార్య భారతికి కూడా సమన్లు జారీ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నట్లు జగన్ లేఖలో పేర్కొన్నారు. కేవలం చంద్రబాబుకు అనుకూలంగా తమను ఇబ్బంది పెట్టటానికే ఇద్దరు అధికారులు వ్యవహరిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. డిప్యుటేషన్ ముగిసిన తర్వాత కూడా వారిద్దరు ఇక్కడే ఉండటంలో లక్ష్యమేమిటో స్పష్టంగా తెలుస్తోందని కూడా  జగన్ లేఖలో ప్రస్తావించారు.

గతంలో తన ఆస్తులసై సిబిఐ దాడులు చేసినా ఏనాడు తన కుటుంబసభ్యులను వేధించలేదని...కాని చంద్రబాబు కోసం పనిచేస్తున్న సదరు అధికారులు మాత్రం తన కుటుంబసభ్యులను కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసారు. జగన్ లేఖను        అందుకున్న ప్రధాని ఢిల్లీలోని ఇడి కేంద్రకార్యాలయంలోని ఉన్నతాధికారులకు పంపారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఓ టిడిపి ఎంపి మేనల్లుడు కూడా ఆ ఇద్దరిలో ఉన్నట్లు లేఖలో ఫిర్యాదు చేసారు. కేవలం తమను ఇబ్బంది పెట్టటానికి మాత్రమే చంద్రబాబు ఇద్దరు అధికారుల ద్వారా అటాచ్ మెంట్ ఉత్తర్వులను పదే పదే ఇప్పిస్తున్నట్లు చేసిన ఫిర్యాదుపై విచారణ చేయమని ఉన్నతాధికారులను పిఎంఓ ఆదేశించినట్లు సమాచారం.

ఢిల్లీనుండి వచ్చిన ఆదేశాల ప్రకారం చెన్నైలోని ఇడి ప్రాంతీయ కార్యాలయంలోని ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జగన్ ఫిర్యాదు చేయటం, దానికి ప్రధానమంత్రి వెంటనే స్పందించటం చూస్తూంటే ఇటు ఇడితో పాటు అటు టిడిపిలో కూడా ప్రకంపనలు మొదలైనట్లే ఉంది. ఇంతకీ ఆ ఇద్దరు అధికారులు ఎవరో తెలియాలి.