లోకేష్ ను సిఐడి అడిగిన ప్రశ్నలు ఇవేనట... సమాధానం ఇదేనట..!
నారా లోకేష్ ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి విచారిస్తున్న నేపథ్యంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోంది.

అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు వెనక భారీ కుంభకోణం దాగివుందని సిఐడి ఆరోపిస్తోంది. తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ తో పాటు మరికొందరు సన్నిహితుల ఆస్తుల విలువ పెంచేలా ఆనాటి మంత్రి నారా లోకేష్ ఈ అలైన్ మెంట్ మార్పులో కీలకంగా వ్యవహరించాడని ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి లోకేష్ ను ఏ14గా పేర్కొన్న సిఐడి ఇవాళ అతడిని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య ఓ సరికొత్త వివాదం సాగుతోంది.
నారా లోకేష్ ను సిఐడి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని... సమాధాలు చెప్పలేక అతడు తడబడుతున్నాడని వైసిపి అంటోంది. ఈ మేరకు సిఐడి అధికారులు లోకేష్ ను అడిగిన ప్రశ్నలివే అంటూ కొన్నింటిని వైసిపి విడుదల చేసింది. సిఐడి ప్రశ్నల పేరిట జరుగుతున్న ప్రచారంపై టిడిపి కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతోంది. వైసిపి ప్రశ్నలకు జవాభిస్తూ టిడిపి కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.
వైసిపి ప్రశ్నలు - టిడిపి సమాధానాలు :
వైసిపి ప్రశ్న : ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసు?
టిడిపి సమాధానం : ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కు సంబంధించి ఎటువంటి సమాచారం లోకేష్ గారికి ముందుగా తెలియదు. భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా హైదరాబాద్ ను తలదన్నేలా నాటి టీడీపీ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదించడం మాత్రమే జరిగింది. ఎక్కడా సెంటు భూమి కూడా సేకరించలేదు.
వైసిపి ప్రశ్న : మూడుసార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా?
టిడిపి సమాధానం : ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ లోకేశ్ బాబు తానే స్వయంగా పెన్నుతో గీసినట్లుంది సీఐడీ ఆరోపణ. అలైన్ మెంటు మార్పు వెనుక లోకేష్ పాత్ర ఉందనడం రాజకీయ ప్రేరేపితం మాత్రమే. అలైన్ మెంటు మార్పు అనేది నిపుణులు, ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలు మాత్రమే. వాటికి ఎటువంటి లోకేష్ గారికి ఎటువంటి సంబంధం లేదు.
వైసిపి ప్రశ్న: హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు?
టిడిపి సమాధానం : హెరిటేజ్ కు లబ్ది చేకూర్చేలా అలైన్ మెంటు మార్చారనేది రాజకీయ దుష్ర్పచారం మాత్రమే. అందులో ఎటువంటి వాస్తవం లేదు.
Read More స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా..
వైసిపి ప్రశ్న: హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసింది?
టిడిపి సమాధానం : హెరిటేజ్ సంస్థ సుమారు 11 రాష్ర్టాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నది. వ్యాపార విస్తరణలో భాగంగా 2014 మార్చిలో ఆంధ్రప్రదేశ్ విభజన కంటే ముందే హెరిటేజ్ తీసుకున్న నిర్ణయం ప్రకారం భూమి కొనుగోలు చేయడం జరిగింది.
వైసిపి ప్రశ్న: 2014జులై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా?
టిడిపి సమాధానం : మార్చి 2014లో తీర్మానానికి అనుగుణంగా 2014 జులైలో మరో తీర్మానం చేశారు.
వైసిపి ప్రశ్న: లింగమనేని రమేష్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి?
టిడిపి సమాధానం : లింగమనేని రమేష్ తో లోకేష్ గారికి పరిచయం మాత్రమే ఉంది కాని ఎటువంటి వ్యాపార సంబంధం లేదు.
వైసిపి ప్రశ్న: మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పరిసరల్లోనే భూములు ఎందుకు కొనుగోలు చేశారు?
టిడిపి సమాధానం : ఈ ఆరోపణ పూర్తిగా అసంబద్ధమైనది. చంద్రబాబునాయుడు కుటుంబం భూములు కొంటే వారి పేర్లమీదే కొంటారుగానీ జగన్ కుటుంబంలా బినామీల బతుకు కాదు. జగన్ ఉంటున్న ఇల్లుగానీ, నడుపుతున్న టీవీగానీ, పత్రిక గానీ, వాడుతున్న కారు గానీ నాది అని చెప్పుకోలేని పరిస్థితి.
వైసిపి ప్రశ్న: ఏ1 ముద్దాయి చంద్రబాబు నుంచి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు తెలిసిందా?
టిడిపి సమాధానం : లోకేష్ గారు ఎవరితో ఎటువంటి విషయాలు చర్చించలేదు. చంద్రబాబునాయుడుగారి కుటుంబ సభ్యులకి ఇన్నర్ రింగ్ రోడ్ తోగానీ, అలైన్మెంట్ తో ఎటువంటి సంబంధం లేదు.