నాడు వైయస్ఆర్, నేడు జగన్: ఎన్టీఆర్ సన్నిహితుడికి కీలక పదవి

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా అచార్య యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మి ప్ర‌సాద్‌ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు సంవ‌త్స‌రాల పాటు యార్లగడ్డ ల‌క్ష్మి ప్ర‌సాద్ ఈ పదవిలో కొన‌సాగనున్నారు. ఈమేరకు మంగళవారం జివో ఎంఎస్ నెంబర్ 10ను విడుదల చేశారు పర్యాటక శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్.  

yarlagadda lakshmiprasad elected as a ap state official language council president

అమరావతి: మాజీ రాజ్యసభ సభ్యుడు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు కీలక పదవి కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా అచార్య యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మి ప్ర‌సాద్‌
  ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

రెండు సంవ‌త్స‌రాల పాటు యార్లగడ్డ ల‌క్ష్మి ప్ర‌సాద్ ఈ పదవిలో కొన‌సాగనున్నారు. ఈమేరకు మంగళవారం జివో ఎంఎస్ నెంబర్ 10ను విడుదల చేశారు పర్యాటక శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్. మరోవైపు అధికార భాషా సంఘంలో నలుగురు సభ్యులను కూడా నియమించే వెసులుబాటును సైతం జీవోలో కల్పించారు. 

ఇకపోతే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు, హిందీ సాహిత్య రంగాల‌కు ఎంతో సేవ చేశారు. ద‌క్షిణాదికి చెందిన హిందీ భాషాభిమానిగా అచార్య యార్ల‌గ‌డ్డ దేశ స‌మ‌గ్ర‌త‌ను పెంపొందించేలా సాహిత్య సేవ‌ల‌ను అందించారు. 

తెలుగు సాహిత్యం ఉత్త‌రాది వారికి అవ‌గ‌తం కావాలంటే మ‌న సాహిత్య ప్ర‌క్రియ‌ల‌ను హిందీలోకి అనువదింప‌చేయాల‌న్న ఆలోచ‌న‌ల‌కు ఆద్యునిగా ఉంటూ అష్టావ‌ధానం, శ‌తావ‌ధానం వంటి ప్ర‌క్రియ‌లను అనువ‌దించి హిందీలో ప్ర‌చురింప‌చేయ‌టం ద్వారా మ‌న తెలుగు గొప్ప‌ద‌నాన్ని ఉత్త‌రాదికి ప‌రిచ‌యం చేయడంలో విపరీతమైన కృషి చేశారు యార్లగడ్డ. 

హిందీలో మాత్ర‌మే అందుబాటులో ఉన్న ప‌లు పుస్త‌కాల‌ను తెలుగులోకి కూడా అనువ‌దించి దేశంలోని ఇరు ప్రాంతాల న‌డుమ సాహిత్య వార‌ధిగా వ్య‌వ‌హ‌రించారు. దివంగ‌త సీఎం  వైయస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గ‌తంలో యార్ల‌గ‌డ్డను ఆంధ్ర‌ప్ర‌దేశ్ హిందీ అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా నియ‌మించారు. అనంతరం త‌ర్వాత వచ్చిన ప్ర‌భుత్వాలు హిందీ అకాడ‌మీని నిర్వ‌హ‌ణ‌ను ప‌ట్టించుకోలేదు. 

ఇకపోతే ప్ర‌స్తుతం యార్ల‌గ‌డ్డ లక్ష్మీప్రసాద్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఛైర్మ‌న్‌గా ఉన్న కేంద్రీయ హిందీ సంస్ధ‌లో స‌భ్యులుగా కొనసాగుతున్నారు. 

యార్ల‌గ‌డ్డ అంత‌ర్జాతీయ స్ధాయిలోనూ తెలుగు భాషా, సాహిత్యం, సంస్కృతి ఉన్న‌తికి ఎన్నో సేవలందించారు.  

పలు దేశాల‌లో తెలుగు మ‌హాస‌భ‌ల‌ను నిర్వ‌హించ‌ట‌మే కాకుండా, దేశ రాజ‌భాష హిందీకి ప్రాచుర్యం క‌లిగించే క్ర‌మంలో అవిశ్రాంత పోరాటం చేశారు. మూడు ద‌శాబ్దాలుగా హిందీ కోసం లక్ష్మి ప్ర‌సాద్ ప‌డిన త‌ప‌న అంతా ఇంతా కాదు. 

ఒక వ్యక్తికి ఒక భాషలోనే డాక్టరేట్ ఉండటం సహజం. కానీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు తెలుగు, హిందీ భాషలలో డాక్టరేట్ అందుకున్న ఏకైక వ్యక్తి. ఆంధ్రా యూనివ‌ర్శిటీ హిందీ విభాగ అధిప‌తిగా ఆయ‌న పనిచేశారు. 

1996వ సంవత్సరంలో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. అదే సమయంలో పార్ల‌మెంట‌రీ అధికార భాషా సంఘంకు డిప్యూటీ ఛైర్మ‌న్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. అధికార భాషా సంఘంకు  ఛైర్మ‌న్‌గా మాజీ ఉపప్రధాని ఎల్‌కె అద్వానీ వ్య‌వ‌హ‌రించారు. 

కృష్ణా జిల్లా గుడివాడ స‌మీపంలోని వాన‌పాముల‌కు చెందిన యార్ల‌గ‌డ్డ జైఆంధ్రా ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి జైలు జీవితం సైతం గ‌డిపారు. దివంగ‌త సీఎం ఎన్టీఆర్  కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడిగా పేర్గాంచారు. 

ఎన్‌టిఆర్‌కు హిందీపై ప‌ట్టు సాధించేందుకు అధ్యాపక అవతారం ఎత్తారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఇకపోతే రాష్ట్ర విభజన అనంతరం చంద్ర‌బాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. తెలుగు భాషను చంద్రబాబు పట్టించుకోవడం లేదంటూ నిప్పులు చెరిగే వారు. 

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిరాహారదీక్షలు సైతం చేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. తెలుగు యూనివర్సిటీలకు నిధులు విడుదల చేయడం లేదని, ఆస్తులు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కూడా.  

క‌వుల‌ను, క‌ళాకారుల‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌భుత్వాల‌కు సాహిత్య సంప‌ద‌లో చోటు ఉండ‌ద‌ని పదేపదే చంద్రబాబును విమర్శిస్తూ పాలకుల కంటిలో నలుసుగా మారారు. ఇకపోతే వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

తెలుగుభాష అభివృద్ధికి కృషి చేయాలంటూ సూచించారు. తెలుగుభాషపై ఆయనకు ఉన్న అకుంఠిత దీక్షను చూసిన సీఎం జగన్ ఆయనను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios