రాజమండ్రి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్‌ నిప్పులు చెరిగారు. చంద్రబాబునాయుడు తెలుగు భాషా ద్రోహి అంటూ మండిపడ్డారు. 

తెలుగు భాషను ఉద్ధరిస్తానని చెప్పిన చంద్రబాబు ఆయన వాగ్దానాల్లో ఏ ఒక్కటి అమలు చెయ్యకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల ఆఖరు రోజున రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చకుండా రాజమండ్రి ప్రజలను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజమండ్రి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తెలుగు సాంస్కృతిక పీఠానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం గురవుతున్నాయని వాటిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

తెలుగు సాంస్కృతిక పీఠం భూముల అన్యాక్రాంతం కాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే రాజమండ్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హెచ్చరించారు.