Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ సింహాలైతే... వైఎస్ కుటుంబం గ్రామ సింహాలు..: యరపతినేని సంచలనం

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ను విమర్శించిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబంపై యరపతినేని ఫైర్ అయ్యారు. 

yarapathineni satires on cm ys jagan and his family
Author
Amaravati, First Published Jun 24, 2022, 4:54 PM IST

అమరావతి: పల్నాడు జిల్లాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనను అడ్డుకోడానికి ప్రయత్నించారంటూ స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసిపి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా హెచ్చరించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తున్నారని... కానీ సింహం వేట ఎలా ఉంటదో వైసిపి నేతలు చూడాల్సి ఉంటుందని అన్నారు. పల్నాడులో జరిగిన ప్రతీ హత్యా, దాడి లెక్కలు రాసి పెట్టుకుంటున్నామని యరపతినేని పేర్కొన్నారు. 

 ''రాయలసీమను రత్నాల సీమగా మార్చిన సింహాలు ఎన్టీఆర్, చంద్రబాబులు. వారి వారసత్వమే లోకేష్ ది. కానీ ఇదే రాయలసీమలో కులాల కుంపటి పెట్టి ఫ్యాక్షన్ కు అడ్డాగా మార్చిన రాజారెడ్డి, వైఎస్ ల వారసత్వం జగన్ రెడ్డిది. రాజకీయంగా రాయలసీమను అప్రదిష్టపాలు చేసిన గ్రామ సింహాలు జగన్ కుటుంబ సభ్యులే'' అంటూ యరపతినేని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

పల్నాడులో కుప్పకూలుతున్న సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే వైసిపి నేతలు వరుస హత్యలు, ఊచకోతలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ రెడ్డి, వైసిపి ప్రభుత్వం పతనావస్థకు చేరుకుంది.  ఆంధ్రప్రదేశ్ కు జగన్ రెడ్డి తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే'' అని అన్నారు. 

''సొంత బాబాయ్ ని చంపిన ఏ1 ముద్దాయి ఎవరంటూ పిన్నెలి మతిభ్రమించి మాట్లాడుతున్న తీరును ఆపార్టీ నేతలే గ్రహించుకోవాలి. అక్రమ మద్యం, విగ్రహాల దొంగతనంతో పాటు ఎన్నో అసాంఘిక కార్యకలాపాల  కేసులు పిన్నెలిపై ఉన్నాయి. 10తరగతి ప్రశ్న పత్రాలు దొంగిలించిన బయోడేటా జగన్ రెడ్డిది'' అంటూ మండిపడ్డారు.

''తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమం కోసం తపిస్తూ, పేదలకు అన్నంపెట్టి ఆకలి తీర్చే బయోడేటా లోకేష్ ది. పేదల కడుపునింపే పార్టీ తెలుగుదేశం అయితే వారి పొట్టగొట్టే పార్టీ వైసిపి. అలాంటి పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు'' అని యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

''చంద్రబాబునాయుడును తక్కువ చేసి మాట్లాడే పిన్నెల్లి చంద్రబాబుతో సమానంగా తిరుపతి మెట్లెక్కగలడా?. హత్యా రాజకీయాలు నడుపుతున్నది జగనే.  తోట చంద్రయ్య  చనిపోయినప్పుడు ఇంకా చావాల్సినవారు పది మంది ఉన్నారని స్వయంగా చెప్పారు.  ఇందులో భాగంగానే జల్లా యాదవ్ ను చంపారు. లోకేశ్ తాతగారి చరిత్ర ఘనం, జగన్ తాతగారి చరిత్ర హీనం. బెదిరింపులు, హత్యా రాజకీయాలు చేస్తే టీడీపీ నాయకులు భయపడరు'' అన్నారు. 

''జూలకంటి బ్రహ్మానందరెడ్డికి మాచర్లలో ఇల్లు లేదని మాట్లాడటం వారి నీతి, నిజాయితీలను ఒప్పుకున్నట్లే.  వైసీపీ నాయకుల్లా టీడీపీ నాయకులు బరితెగించలేదు, బజారున పడలేదు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు, ఆస్తులు స్వాధీనం చేసుకోలేదు.  40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరు.  వైఎస్ కుటుంబాన్ని ఇతివృత్తంగా తీసుకొని సినిమాల్లో ఫ్యాక్షన్ కుటుంబాలను చూపిస్తున్నారు. వరుస హత్యలు వైసీపీ నాయకులు చేస్తూ, ఊచకోతలు మీరు చేస్తూ టీడీపీవారిపై రుద్దడం సమంజసం కాదు. రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఉండనీయం అని మాట్లాడుతున్నారు, ఏమీ పీకలేరు'' అన్నారు. 

''వైసీపీకి అధికారం శాశ్వతం కాదు. 1994లో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆరోజు తల్లి కాంగ్రెస్ లో ఉన్నారు, ఈరోజు పిల్ల కాంగ్రెస్ లో ఉన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే 294 సీట్లల్లో 26 సీట్లు మాత్రమే వచ్చాయి'' అని హెచ్చరించారు. 

''సొంత బ్రాండ్ లిక్కర్ తాగి రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది మృత్యువాత పడ్డారు.  మహిళల మెడలలోని తాళిని తెంపిన నీచమైన చరిత్ర వైసీపీది. సామాన్యుడికి మేలు చేయాలి. పేదవాడి కడుపు నింపాలి. పేదల పొట్ట కొట్టే పార్టీ వైసీపీ పార్టీ. టీడీపీ ఘనచరిత్ర కలది. 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటిన్లను పెడితే వాటిని తీసేసి పేదవాడిని నడిరోడ్డున పడేశారు. మంగళగిరిలో లోకేశ్ పేదవారికి అన్నం పెట్టే కార్యక్రమం పెడితే అక్కడ టీడీపీ నాయకులను, పేదవారిని పోలీసులు లాగి కింద పడేసి కొట్టారు. పేదవాడికి అన్నం పెడితే కేసులు పెట్టే పాలన వైసీపీది'' అంటూ మండిపడ్డారు. 

''బరితెగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బరితెగించొద్దు. చరిత్ర తెలుసుకొని వళ్లు దగ్గరపెట్టుకొని ప్రవర్తించాలి. పరిధి దాటొద్దు. ఇది రాచరికపు వ్యవస్థ కాదు. నియంత పరిపాలన కాదు. చంద్రన్న, లోకేశ్ నాయకత్వంలో టీడీపీ కార్యకర్తలు వీరసైనికుల్లాగ పనిచేస్తారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వైసీపీ నాయకులు వళ్లు దగ్గర పెట్టుకోవాలి'' అని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios