గుంటూరు: ఇప్పటికైనా రాష్ట్ర గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ ఆదేశాలను వైసిపి ప్రభుత్వం పాటించాలని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు సూచించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తిరిగి ఎస్‌ఈసిగా నియమించాలన్న ఆయన ఆదేశాలను తక్షణమే అమలుచేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా రమేష్ కుమార్ నే కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని యనమల స్వాగతించారు.

''వైసిపి ప్రభుత్వం మొండిగా మూర్ఖంగా ముందుకెళ్తోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని లెక్క చేయడం లేదు. వ్యవస్థలను తోసిరాజని వ్యవహరిస్తోంది. గవర్నర్ ను కాదని, సుప్రీంకోర్టును కాదని, హైకోర్టును కాదని వైసిపి నాయకులు ఏం చేయాలని అనుకుంటున్నారు..?'' అని ప్రశ్నించారు. 

''అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా..? వ్యక్తి పాలన నడుస్తోందా, వ్యవస్థల పాలన నడుస్తోందా..? ఇదేనా వైసిపి నేతల పరిపాలనా తీరు..? ఇలాంటి మూర్ఖపు పాలన దేశం మునుపెన్నడూ చూడలేదు. ఇది ప్రజా ప్రభుత్వమా, వ్యక్తుల ప్రభుత్వమా..?'' అంటూ నిలదీశారు.

read more  శిరోముండనం కేసులో కింగ్ పిన్ కృష్ణమూర్తి...ఈయన ఎవరంటే...: వర్ల రామయ్య

''ఇది ప్రజలు ఏర్పరుచుకున్న ప్రభుత్వంగా లేదు. ప్రజా ప్రభుత్వం అయితే రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది, వ్యవస్థల ఆదేశాలను పాటిస్తుంది. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ గా లేదు ఆఫ్ ద జగన్, బై ద జగన్, ఫర్ ద జగన్ గా రాష్ట్రంలో పాలన ఉంది. ''ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే'' పాలిస్తున్నట్లుగా లేదు. ''జగన్ కోసం, జగన్ చేత, జగన్ కొరకు'' పాలనలా ఉంది'' అని ఎద్దేవా చేశారు. 

''ఇప్పటికైనా గవర్నర్ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలి. తక్షణమే రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా పేర్కొంటూ ఆదేశాలు ఇవ్వాలి. చేసిన తప్పులకు సీఎం జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి'' అని యనమల రామకృష్ణుడు సూచించారు.