విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనానికి కారణమైన ప్రధాన నిందితుడు కవల కృష్ణమూర్తిని తక్షణ అరెస్ట్ చేసి డీజీపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 

మచిలీపట్నంలో మోకా భాస్కరరావు హత్య కేసులో ఎవరో  ఫోన్ లో మాట్లాడారంటూ మాజీ మంత్రి కోల్లు రవీంద్రను ఏ సాక్ష్యం లేకున్నా అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. కానీ తనకు శిరోముండనం చేయాలని ఎస్సైకి పలుమార్లు ఫోన్ చేసి చెప్పింది కృష్ణమూర్తి మాత్రమేనని స్వయంగా బాధితుడు వరప్రసాద్ ప్రకటనకు వీడియో సాక్ష్యాలున్నాయి. అలాంటప్పుడు కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడంలో తాత్సారం ఎందుకు? అని వర్ల ప్రశ్నించారు. 

సీతానగరంలో ఇసుక మాఫియాను ప్రశ్నించానన్న అక్కసుతో ఎస్సైపై ఒత్తిడి చేసి  శిరోముండనం చేయించారని దళిత యువకుడు వరప్రసాద్ బహిరంగంగా చేబుతున్నాడని అన్నారు. ప్రకటన ఆధారంగా కింగ్ పిన్ కృష్ణమూర్తి అరెస్ట్ చేయాలన్నారు.  

read more  విజయసాయి, అవంతి రెచ్చిపోయినా: నోరు విప్పని గంటా, కారణమదే...

వరప్రసాద్ ను తీవ్రంగా అవమానించి, అతనిపై దాడికి పాల్పడేలా స్థానిక ఎస్సైని ప్రలోభపెట్టిన కృష్ణమూర్తి ఎవరు? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు మూకుమ్మడిగా ఇసుక మాఫియాగా మారి అడ్డు వచ్చిన సామాన్యులపై పెట్రేగి అరాచకాలకు పాల్పడుతున్నారనడానికి ఈ కేసు ప్రబల తార్కాణం అని అన్నారు. 

''తన గ్రామంలో జరిగే ఇసుక మాఫియాను ప్రశ్నించడమే వరప్రసాద్ చేసిన నేరమా? వైసీపీ నేతల ప్రోద్భాలంతో శిరోముండనం చేసిన ఎస్సైని సస్పెండ్ తో సమస్య సమసిపోదు. తక్షణం అందుకు కారకులైన సీతానగరంలోని ఇసుక మాఫియా కింగ్ పిన్ కృష్ణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఇతరత్రా బాధ్యులను కూడా అదుపులోకి తీసుకోవాలి'' అని డిమాండ్ చేశారు. 

''సీతానగరంలో వరప్రసాద్ కు జరిగిన అవమానం చూస్తుంటే ఏపీలో దళితులు నివసించలేని గడ్డుస్థితి నెలకొంది. పోలీసుల నిష్ఫక్షపాత దర్యాప్తుతో అసలైన నిందితుల అరెస్ట్ తర్వాత అయినా జగన్ నాయకత్వంలో దళితులపై పెరిగిన దాడులకు అడ్డుకట్ట పడతాయని ఆశిస్తున్నాం. రాష్ట్రంలో అభద్రతా భావానికి లోనైనా దళితజాతికి ఆత్మస్థైర్యం కలిగేలా డీజీపీ పకడ్బందీ చర్యలకు ఈ కేసుతో నాంది పలకాలి'' అని వర్ల రామయ్య అన్నారు.