అమరావతి: వైసిపి ప్రభుత్వం మొదటి నుంచీ రాజధాని మార్పుపై దురుద్దేశంతో వ్యవహరిస్తోందని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సెలెక్ట్ కమిటీ వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగా మళ్లీ సీఆర్డీఏ చట్టం రద్దు, వికేంద్రీకరణ బిల్లులు తీసుకురావటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని...ప్రజాభీష్టానికి ఇది వ్యతిరేకమన్నారు. 

శాసనసభ రెండోసారి బిల్లులు పాస్ చేసి మళ్లీ మండలికి పంపటం సరికాదన్నారుఎలాంటి సవరణలు లేకుండా మళ్లీ పాతాబిల్లులు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సెలెక్ట్ కమిటీ వద్ద బిల్లు ఉందని స్వయంగా ఏజీ కోర్టుకు చెప్పారని గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లో శాసనమండలిలో ఈ బిల్లును అడ్డుకుంటామని...ఎలా అడ్డుకుంటామో మీరే చూస్తారంటూ యనమల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ మండలి విప్ బుద్దా వెంకన్న మాట్లాడుతూ... సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రకరణ రెండు బిల్లులను మళ్ళీ అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ఎప్పటికి ఇక్కడ నుండి తరలిపోకుండా చూస్తామన్నారు. రాజధాని కోసం ఎంతవరకయినా పోరాడుతామని తెలిపారు. సీఎం జగన్ విశాఖ వస్తుంటే అక్కడ ప్రజలు భయపడిపోతున్నారని అన్నారు. సెలెక్ట్ కమిటీ, హై కోర్ట్ లో ఉండగా మళ్ళీ బిల్లులు ఎలా మండలికి పంపిస్తారని బుద్దా వెంకన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Read more   సీఆర్‌డీఏ రద్దు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు చర్చించొద్దు: మండలి ఛైర్మెన్ షరీఫ్ కు టీడీపీ నోటీసు

మంగళవారం శాసనసభ ఆమోదించిన సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులను ప్రభుత్వం బుధవారం శాసమండలిలో ప్రవేశపెట్టనుంది. అయితే ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని ఇదివరకే శాసమండలి నిర్ణయించినా మరోసారి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం చూడడంతో ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

 ఈ రెండు బిల్లులను మరోసారి ప్రవేశపెట్టకూడదని నిన్న బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఈ బిల్లులను ప్రవేశపెట్టిన సమయంలో టీడీపీ సభ్యులు అసెంబ్లీలో లేరు. అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందింది.

శాసనమండలిలో 178 నిబంధన కింద మరోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టుగా అధికార వైసీపీ చెబుతోంది. సాధారణ పరిస్థితుల్లో 178 నిబంధన కింద ఈ బిల్లులు ప్రవేశపెట్టడం సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ప్రత్యేక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ రెండు బిల్లులు మండలిలో ప్రవేశపెట్టడం సాధ్యం కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు.