గుంటూరు: జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని... కేవలం తన స్వప్రయోజనాల కోసమే ఆయన ఢిల్లీ వెళ్లాడని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో సరైన కార్యాచరణ ప్రణాళిక లేదు... అయినప్పటికి వీటిపై కేంద్ర మంత్రులతో చర్చించానని చెప్పుకునే ప్రచారం చేయనున్నారని అన్నారు. ఇందుకోసం తప్ప సీఎం ఢిల్లీ పర్యటన మరెందుకూ పనికిరాదన్నారు యనమల. 

''ప్రత్యేక విమానాల్లో పదేపదే ఢిల్లీ వెళ్తున్న జగన్ రెడ్డి... రాష్ట్రానికి ప్రత్యేకంగా తీసుకొస్తున్నవి ఏమిటి? బెయిల్ రద్దవుతుందనే భయంతో ఢిల్లీ పెద్దల ముందు సాష్టాంగపడుతున్నారు. జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సమావేశం తాలూకు వివరాలను ఎందుకు ప్రజలకు వెల్లడించడం లేదో సమాధానం చెప్పాలి. కేంద్రానికి ఇచ్చిన విజ్ఞాపన పత్రాలను మీడియాకు ఎందుకు విడుదల చేయడం లేదు? దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? మీడియా ముందుకు వచ్చి ఎందుకు వాస్తవాలు చెప్పడంలేదు? దీనిని బట్టే లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారని బహిర్గతం అవుతోంది'' అని యనమల ఆరోపించారు.

''ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో అంశాల అమలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో జగన్మోహన్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. రాష్ట్ర సమస్యలను జగన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు. వైసిపి ఎంపీలు ఏనాడూ పార్లమెంట్ లో నోరెత్తలేదు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తానని ఊరూరా తిరిగి ప్రచార చేశారు. ప్రత్యేక హోదా తెస్తామని ఓట్లు పొందారు. ఇప్పుడు ప్రజల గొంతు కోశారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న మాట ఏమైంది?'' అని ప్రశ్నించారు. 

''కేసుల మాఫీ కోసం సీఎం కేంద్రం వద్ద మెడలు దించారు. హోదా వస్తే ఒంగోలు కూడా హైదరాబాద్ లా తయారు అవుతుందనే మాటలు మర్చిపోయారా? ప్రత్యేక హోదా వస్తేనే పెట్టుబడులు, ఉద్యోగాలు, నిధులు వస్తాయని యువతకు చెప్పిన జగన్ రెడ్డి.. నేడు వారికి నమ్మకద్రోహం చేశారు. ఎందుకు ప్రత్యేక హోదాను కేంద్రాన్ని అడగలేకపోతున్నారు? హోదాను ఓట్లు దండుకోవడానికే, ప్రజలను మోసం చేయడానికే జగన్ రెడ్డి వినియోగించుకున్నారు తప్ప.. చిత్తశుద్ధి లేదు.  జగన్ రెడ్డి గట్టిగా అడిగితే అవినీతి కేసుల్లో జైలుకు పంపిస్తారనే భయంతో అడగలేకపోతున్నారు'' అని ఎద్దేవా చేశారు.

read more  గతంలో గద్దించి... నేడు గండుపిల్లిలా మౌనమేల జగన్ రెడ్డి: అచ్చెన్న సెటైర్లు

''మూడు రాజధానుల పేరుతో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇడుపులపాయకే పరిమితమైన ఉన్మాదాన్ని రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నారు. విధ్వంసానికే మూడు రాజధానులు తప్ప.. అభివృద్ధి వికేంద్రీకరణకు కాదనే విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 30ఏళ్లు వెనక్కి నెట్టారు'' అని మండిపడ్డారు.

''రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాకపోవడంతో యువత ఉద్యోగాలు లేక నష్టపోతున్నారు. ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి జరగలేదని ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తూఉంటే మరోవైపు పరిశ్రమల శాఖ మంత్రి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రానికి ఆదాయం లేకపోవడంతో లక్షలాది కోట్లు అప్పులు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ప్రభుత్వ ఆస్తులను తనాఖా పెట్టే స్థితికి దిగజారారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భవనాలు, స్థలాలను తనఖా పెట్టి రూ.5వేల కోట్లు సమీకరించాలని భావించడం జగన్ రెడ్డి అసమర్థ విధానాలకు నిదర్శనం'' అని విమర్శించారు.

''విశాఖలో జిల్లా కలెక్టరేట్, తహశీల్దారు కార్యాలయాలతో సహా 15శాఖల విలువైన స్థలాలను ఏపీఎస్ డీసీకి కట్టబెట్టి అప్పులు తెచ్చుకునేందుకు అర్రులు చాస్తున్నారు. భవిష్యత్ లో ప్రజల ఆస్తులు కూడా తాకట్టుపెట్టేలా జగన్ రెడ్డి విధానాలు ఉన్నాయి. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని తెగనమ్ముతోంది.  తక్షణమే భూముల విక్రయాలు, తనఖాలను ఉపసంహరించుకోవాలి'' అని డిమాండ్ చేశారు. 

''తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రూ. 43వేల కోట్ల ఆక్రమ ఆస్తులు సంపాదించారని తన చార్జిషీట్లలో సీబీఐ కూడా నిర్దారించింది. వేల కోట్ల ప్రజాసంపదను బినామీ కంపెనీలతో లూటీ చేశారు. జగన్ రెడ్డి తాను సంపాదించిన అక్రమాస్తులను ఖజానాకు జమ చేసి ప్రజలకు వినియోగించాలి. అప్పుడు రాష్ట్ర రెవెన్యూలోటు కూడా తగ్గుతుంది'' అని యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు.