Asianet News TeluguAsianet News Telugu

రెండేళ్ల ప్రగతిపై ఆ మంత్రి చెప్పినవన్నీ కాకిలెక్కలే... అసలు లెక్కలివే..: యనమల

వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదని... ఒక్క ఉద్యోగం కల్పించలేదన్నారు మాజీ ఆర్థిక మంత్రి యనమల.

yanamala ramakrishnudu reacts on two years industrial development in ap akp
Author
Guntur, First Published Jun 9, 2021, 12:18 PM IST

గుంటూరు: రాష్ట్రంలో గత రెండేళ్లలో జరిగిన పారిశ్రామిక ప్రగతి శూన్యమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదని... ఒక్క ఉద్యోగం కల్పించలేదన్నారు. పారిశ్రామికాభివృద్ధిపై మంత్రి గౌతమ్ రెడ్డి చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని యనమల అన్నారు. 

''రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఎంఎస్ఎంఇలకు మీరు ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశారు? మత్స్యకారుల పేరుతో షిప్పింగ్ యార్డులను మీ బినామీలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్.ఇ.జెడ్ లను కూడా మీ అనుయాయులకు అప్పగించుకున్నారు'' అని ఆరోపించారు. 

''రాష్ట్రంలో అంతా బాగుంటే పారిశ్రామిక వృద్ధిరేటు -3.26 కి ఎందుకు పడిపోయింది?  రాష్ట్రంలో జిఎస్ డిపి రేటు 1.58గా నమోదైనట్లు మంత్రి తప్పుదారి పట్టిస్తున్నారు. 2011-12 స్థిరీకరించిన ధరల ప్రకారం జిఎస్ డిపి రేటు -2.58గా నమోదైంది. దేశవ్యాప్తంగా జిఎస్ డిపి కి ఈ లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. గత ఏడాదితో పోల్చినా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది. సేవల రంగం వృద్ధి రేటు -6.71కి పడిపోయింది'' అని తెలిపారు. 

''తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు సార్లు పారిశ్రామిక సదస్సులు నిర్వహించి 15.45 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 32లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాం. ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ ఏమైపోయాయి? రాష్ట్రంలో గత రెండేళ్లలో 17లక్షల కోట్లరూపాయల విలువైన భారీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. కియా అనుబంధ పరిశ్రమలు, లులూ గ్రూప్, ఆసియా పేపర్ మిల్, అదానీ డాటా సెంటర్, హెచ్ ఎస్ బిసి వంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి'' అన్నారు. 

''తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 39,450 పరిశ్రమలు ఏర్పాటై 5,13,351 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా పరిశ్రమలమంత్రి ప్రకటించిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయితే ఆయా కారిడార్ల పరిధిలో కనీసం భూసేకరణకు కూడా సరిపడా నిధులు ఈ ప్రభుత్వం కేటాయించడం లేదు. రాష్ర్టవ్యాప్తంగా ఇండస్ట్రియల్ కారిడార్ల పరిధిలో ఇప్పటివరకు 20శాతం భూసేకరణ కూడా పూర్తికాలేదు. భూసేకరణకు 50వేల కోట్లరూపాయలు అవసరం కాగా, ఈ ఏడాది బడ్జెట్ లో కేవలం వెయ్యికోట్ల రూపాయలు కేటాయించారు'' అని తెలిపారు.

read more  మేం ఎక్కువ చేస్తున్నాం... తక్కువ చెప్పుకుంటున్నాం: మంత్రి గౌతమ్ రెడ్డి

''మూడేళ్లలో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో మౌలిక సదుపాయాల కోసం కేవలం రూ.250 కోట్లు కేటాయించారు. దీనిని బట్టి స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై వారికున్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది'' అని ఎద్దేవా చేశారు. 

''ఎస్ఎస్ఎంఇ ల  కోసం గతంలో కేటాయించిన భూములకు రెట్టింపు ధరలు చెల్లించాలని ఒత్తిడి తెస్తుండటంతో వారంతా పారిపోతున్నారు. కొన్నిచోట్ల ఎంఎస్ఎంఇలకు కేటాయించిన భూములను ఇళ్ల స్థలాలకోసం లాక్కున్నారు. దీనినిబట్టే పారిశ్రామికాభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుంది'' అని మండిపడ్డారు. 

''కరోనా కారణంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో లక్షకు పైగా ఎంఎస్ఎంఇ లు ఉండగా, కేవలం 12వేల ఎంఎస్ఎంఇలకు మాత్రమే రూ. 905 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు సుమారు 5వేల కోట్లరూపాయలు ఉండగా, గత రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇవన్నీ పరిశీలిస్తే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతుండగా... పరిశ్రమల మంత్రి మాత్రం పెద్దఎత్తున పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్నట్లు కాకిలెక్కలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది'' అన్నారు. 

''వైసిపి ప్రభుత్వం పాలించిన గత రెండేళ్లలో రాష్ట్రంలో సాధించిన పారిశ్రామిక ప్రగతి, కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయండి'' అని మాజీ మంత్రి యనమల జగన్ సర్కార్, మంత్రి మేకపాటిని   డిమాండ్ చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios